నిండుగ‌ర్భిణి..కాన్పున‌కు కొన్నిగంట‌ల ముందు ఆసుప‌త్రి నుంచి అదృశ్యం!

తిరువ‌నంత‌పురం: ఆమెకు అది తొలి చూలు కాన్పు. తొమ్మిది నెల‌లు నిండాయి. పురిటి నొప్పులు ఆరంభం కావ‌డంతో.. భ‌ర్త‌, అత్తామ‌మ‌, త‌ల్లిదండ్రులు ద‌గ్గ‌రుండి ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆమెకు అన్ని ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్‌.. ఆప‌రేష‌న్ చేయ‌డానికి ఏర్పాట్లు చేయాల‌ని సిబ్బందిని సూచించారు.

మ‌రుస‌టి రోజు ఆమెకు సిజేరియ‌న్ చేయాల్సి ఉండ‌టంతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. పుట్ట‌బోయే బిడ్డ కోసం క‌ల‌లు గంటూ భ‌ర్త‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలోనే గ‌డిపారు. అంత‌లోనే- ఆమె క‌నిపించ‌ట్లేదంటూ స‌మాచారం అందింది. కాన్పు కోసం ఆప‌రేష‌న్ గ‌దిలోకి తీసుకెళ్లిన నిండు గ‌ర్భిణీ అదృశ్య‌మైంది.

ఎటు వెళ్లిందో, ఎక్క‌డికి వెళ్లిందో, అస‌లు ఎలా వెళ్లిందో అంతుచిక్క‌ని ప‌రిస్థితి. ఓ గంట గ‌డిచిన త‌రువాత ఆ నిండుగ‌ర్భిణి భ‌ర్త‌కు ఫోన్ చేసింది. `నేను క్షేమంగా ఉన్నాను..` అనే ఒకే ఒక్క మాట ఆమె నోటి నుంచి వెలువ‌డింది. ఆ త‌రువాత ఫోన్ స్విచాఫ్‌. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని ఎస్ఏటీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆమె పేరు షమ్నా. 21 సంవ‌త్స‌రాలు. వ‌ర్క‌ళ స‌మీపంలోని మ‌డ‌వూర్ గ్రామానికి చెందిన ష‌మ్న త‌న భ‌ర్త అన్ష‌ద్‌, ఇత‌ర కుటుంబీకుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఉదయం 10:30 గంట‌ల‌కు ఆసుప‌త్రికి వ‌చ్చింది. అన్ని ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్.. మ‌రుస‌టి రోజు సిజేరియ‌న్ చేస్తామ‌ని అన్నారు. దీనితో వారు ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు.

మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర‌కు ఆమె అదృశ్య‌మైంది. నిండుగ‌ర్భిణి, కాన్పుకు ఒక్క‌రోజు ముందే ఆసుప‌త్రి నుంచి అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు. సెల్ ఫోన్ సిగ్న‌ళ్ల ఆధారంగా సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఆమె ఎర్నాకుళం స‌మీపంలో ఉన్న‌ట్టు గుర్తించారు.

ఎర్నాకుళం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చే స‌మ‌యానికి ఆమె మొబైల్ సిగ్న‌ల్ త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దులు దాటిన‌ట్టు తేలింది. చివ‌రికి- త‌మిళ‌నాడులోని వేలూరుకు చేరుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

ఆమెతో మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించ‌గా ఫోన్ స్విచాఫ్‌లో ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. వేలూరు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆమె కోసం ఓ ఇద్ద‌రు మ‌హిళా కానిస్టేబుళ్ల‌తో క‌లిసి వ‌ర్క‌ళ పోలీసులు వేలూరుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here