ఏంటి 2000 రూపాయల కోసమా అన్ని రోజులు సినిమా హాళ్ళు బంద్ చేసింది..!

దాదాపు వారం రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి సినిమా హాళ్ళు తెరచుకోనున్నాయి. VFO/QUBE డిజిటల్ సంస్థలతో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ జేఏసీ ప్రకటించింది. అయితే అంతా చేసినా నిర్మాతలకు వచ్చిన లాభం కేవలం 2000 రూపాయలేనని అంటున్నారు నిర్మాత నట్టి కుమార్. ఆయన చెప్పిన కోణం వేరేగా ఉంది. బడా నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ స్వార్థానికి మరో సారి చిత్ర పరిశ్రమ బలైందని అంటున్నారు ఆయన.

చిత్రపరిశ్రమలోని కొంత మంది బడా నిర్మాతల స్వార్థ ప్రయోజనాల కోసమే థియేటర్ల బంద్ జరిగిందని.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అధిక రేటు వసూలు చేస్తున్నారంటూ చేసిన బంద్ సినీ పరిశ్రమ మేలు కోసం చేసింది కాదని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, యూఎఫ్ఓ సంస్థల వెనుక సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ వంటి నిర్మాతలు ఉండడం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. బంద్ కు ముందు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 12 వేల రూపాయల ఫీజు వసూలు చేసేవారని, పది వేల రూపాయలు వసూలు చేయాలంటూ ఆరురోజులు థియేటర్లు బంద్ చేశారని ఆయన తెలిపారు. చిన్న సమస్య కోసం ఆరురోజులు బంద్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఆరురోజుల బంద్ వల్ల చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఏర్పడిన కోట్ల రూపాయలు నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.

వర్చువల్ ప్రింట్ ఫీజును పూర్తిగా తొలగించాలన్న డిమాండ్ కు డిజిటల్ సంస్థలు ఒప్పుకోలేదు. మధ్య మార్గంగా కొత్త రేట్లు నిర్ణయించారు. మూవీ మొత్తానికి రూ.2లక్షలు ఛార్జ్ చేయాలని నిర్ణయించారు. చిన్న సినిమాల విషయంలో అయితే ప్రతి షో ఆధారంగా ఛార్జ్ వసూలు చేయనున్నారు. మొదటి వారం, రెండు, మూడు వారాల ఆధారంగా ధర నిర్ణయించాయి డిజిటల్ ప్రొవైడర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here