బుర‌ద‌గుంట‌లో యువ‌తి: 12 గంట‌లు..స‌జీవంగా!

ఏలూరు: రైలు ప‌ట్టాలకు ఆనుకుని ఉన్న ఓ బుర‌ద‌గుంట‌లో ఓ యువ‌తి సుమారు 12 గంట‌ల పాటు అలాగే ప‌డి ఉన్న ఘ‌ట‌న ఇది. ప‌ట్టాల‌ను ప‌రిశీలించ‌డానికి వ‌చ్చిన సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆక‌వీడు-గుమ్ములూరు స్టేష‌న్ల మ‌ధ్య చోటు చేసుకుంది. ఆ యువ‌తి పేరు రాజేశ్వ‌రిగా గుర్తించారు. భీమ‌వ‌రం త‌న స్వ‌స్థ‌లం.

భీమవరంలోని శ్రీరామ్‌పురానికి చెందిన రాజేశ్వరి బీఈడీ విద్యార్థిని. విజయవాడ నుంచి తిరుపతి-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. టాయ్‌లెట్ కోసం వెళ్లిన రాజేశ్వ‌రి ఆకివీడు-గుమ్ములూరు స్టేషన్ల మ‌ధ్య ప్ర‌మాదావ‌శాత్తూ కిందపడిపోయింది. వేగంగా వెళ్తోన్న రైలు నుంచి నేరుగా బుర‌ద‌గుంట‌లో ప‌డింది.

అలా ప‌డిన రాజేశ్వ‌రి.. వెంట‌నే లేవ‌లేక‌పోయింది. స్పృహ త‌ప్పింది. స్పృహ‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ..ఆ షాక్ నుంచి తేరుకోలేక‌పోయింది. రాత్రంతా అదే స్థితిలో క‌నిపించింది. ఉదయం అటుగా వచ్చిన కీ మేన్ ఒకరు ఆమెను గుర్తించారు.

వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్‌మన్ల స‌హాయంతో యువతిని బయటికి తీశారు. ఒంటిపై ఉన్న బుర‌ద‌ను తొల‌గించారు. దీనికోసం వారు ట్యాంక‌ర్‌నే తీసుకొచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం త‌ప్పింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here