రాజీవ్ హ‌త్య‌కేసులో మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

చెన్నై:  దేశాన్ని కుదిపేసిన‌ మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ హ‌త్య‌కేసులో యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తోన్న ప్ర‌ధాన ముద్దాయి నళిని శ్రీ‌హ‌ర‌న్‌కు మ‌ద్రాస్ హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది. నిర్దేశిత గ‌డువు కంటే ముందే త‌న‌ను విడుద‌ల చేయాలని, మాన‌వీయ కోణంలో ఈ అంశాన్ని ప‌రిశీలించాలంటూ ఆమె చేసిన విజ్ఞ‌ప్తిని మ‌ద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ మేర‌కు ఆమె దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను మ‌ద్రాస్ హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌లేదు. న‌ళిని గ‌త ఏడాది ఈ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. దీనిపై మ‌ద్రాస్ హైకోర్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కోరింది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో కౌంట‌ర్ దాఖ‌లు చేసింది.

న‌ళిని త‌ర‌హా కేసులకు సంబంధించిన విజ్ఞ‌ప్తులు చాలా ఉన్నాయ‌ని, ఒక్క‌సారి అలాంటి పిటీష‌న్ల‌పై సానుకూల నిర్ణ‌యం తీసుకుంటే.. మిగిలిన వాటికీ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఆమె దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన డివిజ‌న్ బెంచ్ న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ కేకే శ‌శిధ‌ర‌న్‌, జ‌స్టిస్ ఆర్ సుబ్ర‌మ‌ణియ‌న్ ఈ మేర‌కు తీర్పు ఇచ్చారు.

ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇదివ‌ర‌కే త‌న తుది తీర్పును వెలువ‌రించినందున అందులో.. తాము జోక్యం చేసుకోలేమ‌ని న్యాయ‌మూర్తులు తెలిపారు. 1991 మే 21 తేదీన ఎన్నిక‌ల ప్ర‌చారానికి త‌మిళ‌నాడులోని శ్రీ‌పెరుంబుదూర్‌కు వెళ్లిన రాజీవ్‌గాంధీ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. అదే ఏడాది జూన్ 14వ తేదీన న‌ళిని అరెస్టు అయ్యారు.

రాజీవ్ హ‌త్య‌కేసులో న‌ళిని ముద్దాయి. ఈ కేసును విచారించిన ప్ర‌త్యేక న్యాయ‌స్థానం.. న‌ళినితో పాటు మ‌రో 25 మందికి ఉరి శిక్ష విధిస్తూ 1998లో తీర్పు ఇచ్చింది. రాజీవ్‌గాంధీ భార్య‌, ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియాగాంధీ చేసిన సూచన మేర‌కు న‌ళిని మ‌ర‌ణ‌శిక్ష‌ను యావజ్జీవ కారాగార శిక్ష‌గా బ‌ద‌లాయించారు.

ప్ర‌స్తుతం న‌ళిని వేలూరు కేంద్ర కారాగారంలో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. 25 సంవ‌త్స‌రాల‌కు పైగా ఆమె జైలు జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఈ ఉద్దేశంతోనే.. త‌న‌ను గ‌డువు కంటే ముందే విడుదల చేయాల‌ని కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా.. మ‌ద్రాస్ హైకోర్టు దాన్ని తిర‌స్క‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here