యుఏఈ నుండి పారిపోయిన రాజకుమారి.. తండ్రి మీద పలు ఆరోపణలు..!

నిజమా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాజకుమారీల జీవితం మరీ అంత హీనంగా ఉంటుందా..? రాజకుటుంబీకులు ఇంట్లో మహిళలను జైల్లో బంధించినట్లు బంధిస్తారా.. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం యుఏఈ రాజు మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మకతూమ్ కూతురు అక్కడి నుండి పారిపోయి వచ్చిందట. డెయిలీ మెయిల్ పత్రికకు ఇచ్చిన కథనంలో ఆమె తన ప్రాణాలను కాపాడమని అమెరికాను కోరిందట..

యుఏఈ రాజు అయిన షేక్ మొహమ్మద్ కూతురు అయిన లతీఫా తాను యుఏఈ నుండి పారిపోయి వచ్చానని చెప్పుకొంది. అక్కడితో ఆగకుండా తన తండ్రి మీద ఎన్నో ఆరోపణలు చేసింది. 33సంవత్సరాల షేక్ లతీఫా తాను పారిపోవడానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పరిస్థితులేనని చెప్పింది. యుఏఈలో మహిళలు ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పుకొచ్చింది. తనను మూడు సంవత్సరాల పాటూ జైలులో ఉంచారని.. ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదని చెప్పుకొచ్చింది లతీఫా.

ఆ తర్వాత తాను మానసికంగా కృంగిపోయానని.. ఆసుపత్రిలో తనను పెట్టారని చెప్పింది. తనను ఎప్పుడు కూడా ఒక రాజవంశానికి చెందిన దాని లాగా చూపించలేదని.. కనీసం బయట ప్రపంచంతో తనకు సంబంధాలు లేకుండా చేశారని చెప్పింది. తన తండ్రికి ఆరుగురు భార్యలని.. వారికి మొత్తం 30 మంది పిల్లలని తెలిపింది.

తాను ఒక గూఢచారితో సహాయం తీసుకొని.. ఓ ప్రైవేట్ బోట్ లో దాక్కొని వచ్చానని చెప్పింది. తనకు అమెరికా రక్షణ కల్పించాలని కోరింది. 16 సంవత్సరాల వయసులోనే తాను పారిపోవాలని భావించానని.. అప్పుడు తనను పట్టుకొని బంధించారని చెప్పుకొచ్చింది. 2000 సంవత్సరం తర్వాత తనను బయటకు కూడా రానివ్వలేదని చెప్పుకొచ్చింది లతీఫా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here