ప్ర‌వాహ‌మ‌దే – నీరే కొత్త‌ది – సాక్ష్యం చిత్ర స‌మీక్ష‌

ఒక వ‌ర్గానికి చెందిన కొంద‌రు ఏ కార‌ణం లేకుండానే నేరాలు చేస్తూ, ఎలాంటి సాక్ష్యాధారాల‌ను రూపుమాపి పెద్ద‌మ‌నుషులుగా చెలామ‌ణీ అవుతుంటారు. కానీ ప్ర‌కృతి మాత్రం వారి నేరాల‌కు సాక్ష్యంగా ఉంటుంది. పంచ‌భూతాలు కుమ్మ‌క్కై ఆ నేర‌గాళ్ళ‌పై ప‌గ‌తీర్చుకుంటుంది. ప్ర‌కృతికి ఎదురొడ్డి వారు బ‌తికి బట్ట‌క‌ట్ట‌గ‌ల‌రా? అనేదే సాక్ష్యం సినిమా. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు.  ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక సినిమాలతో తన ఇమేజ్ ను పెంచుకోవడమే కాకుండా.. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మినీ బాహుబలిగా వర్ణించదగ్గ సినిమా అంటూ ప్రచారం చేసిన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.

కథేమిటంటే
విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో గేమ్ డెవలపర్). అమెరికాలో సంపన్న బిజినెస్ టైకూన్ శివ ప్రకాశ్ (జయప్రకాశ్) పెంపుడు కుమారుడు. చిన్నతనంలోనే మునుస్వామి (జగపతిబాబు) తన తల్లిదండ్రుల (శరత్ కుమార్, మీనా)ను, మొత్తం ఫ్యామిలీని చంపేస్తుంది. కానీ ఆ విషయం విశ్వాజ్ఞ‌కు తెలియదు. అయితే వారి హత్యలకు ఓ సాక్ష్యం మిగులుతుంది. ఈ క్రమంలో అక్క‌డే ఒక హిందూ సంస్కృతికి చెందిన దేవాల‌యంలో ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఓ చిన్న కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. తనకు చెప్పకుండా ఇండియాకు వచ్చిన ప్రేయసికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అత‌డు కూడా  అక్కడికి చేరుకొంటాడు. అయితే అక్రమాలకు, అన్యాయానికి పాల్పడే దుష్టులు (జగపతిబాబు, అశుతోష్ రాణా, రవి కిషన్, మధు గురుస్వామి, కబీర్) ఒక్కొక్కరిని కారణం తెలియకుండా పంచభూతాల సహాయంతో చంపేస్తుంటాడు. ఎందుకు చంపేశారు? అనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే…

రాజ వంశానికి చెందిన శరత్ కుమార్ కుటుంబం తమకు అడ్డు వస్తుందని చెప్పి జగపతిబాబు సోదరులు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు.  ఆ కుటుంబాన్ని నాశనం చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించకూడదని, సాక్ష్యం ఎవరూ ఉండకూడదని పిల్లలను, పశువులను అందరిని చంపేస్తారు. ఈ కుటుంబంలో లేకలేక పుట్టిన పిల్లవాడు విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్).  జగపతి బాబు సోదరులు సృష్టించిన మారణకాండ నుంచి ఏదోలా తప్పించుకుంటాడు.  అక్కడి నుంచి విదేశాలకు వెళ్లి అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు.  అక్కడి నుంచి కొన్ని కారణాల వలన ఇండియాకు వచ్చి, తన కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ
హీరో కుటుంబాన్ని నాశనం చేయడం, హీరో పెద్దవాడయ్యాక తన కుటుంబాన్ని నాశనం చేసిన దుర్మార్గులపై పగ తీర్చుకోవడం వంటి కథలతో కూడిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి.  బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇలాంటి పాయింట్ తో వచ్చిన సినిమాలు కోకొల్లలు.  ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ వంటి హీరోలు ఆ కాలంలోనే ఈ పాయింట్ తో అనేక సినిమాలు చేశారు.  పాయింట్ సింపుల్ గా ఉన్నా దాని చుట్టూ అల్లుకునే కథనాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం.  కథనాలు కొత్తగా ఉండి, ప్రేక్షకులను కన్విన్స్ చేయగలిగేవిగా ఉంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.  ఈ కథలో పగ ప్రతీకారాలకు దర్శకుడు పంచభూతాలనే నేపథ్యాన్ని జోడించి ఆసక్తిని కలిగేలా చేశాడు.  పగ తీర్చుకోవడంలో పంచభూతాలు ఎలా సహాయపడ్డాయన్నది ఇక్కడ ఆసక్తికరం.  సినిమా ఓపెనింగ్ నుంచి మొదటి పది పదిహేను నిముషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  ఉత్కంఠను రేకెత్తించాడు.  ఎప్పుడైతే అక్కడి నుంచి కథ విదేశాలకు వెళ్తుందో అక్కడ ఆ బిగుతు సడలి రొటీన్ గా విసుగు తెప్పించింది.  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డేల మధ్య ప్రేమ కథ పెద్దగా వర్కౌట్ కాలేదు.  హీరో ఇండియాకు తిరిగి వచ్చిన తరువాతే కథ స్పీడ్ అందుకుంటుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఆసక్తికరంగా మలచడంతో ఫస్ట్ హాఫ్ కు మంచి మార్కులు పడ్డాయి.

సెకండ్ హాఫ్ అంతా మాస్ ప్రేక్ష‌కుల కోస‌మే
మాస్ ప్రేక్షకుల కోసమే సెకండ్ హాఫ్ తీసినట్టుగా ఉంది. శత్రువులను చంపే విధానం ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా అంతటికి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ లో పంచభూతాలను మేళవించడం కొత్తగా అనిపించింది. హీరోకు తన గతం గురించి తెలియకపోయినా.. శత్రువులను ఒక్కొక్కరిగా చంపుతుంటాడు. పంచభూతాలను ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ చేస్తూ కథను తెలివిగా నడిపించిన విధానం బాగుంది. అయితే అంత ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌లో ఏమాత్రం సంద‌ర్భానుసారం లేకుండా సడెన్ గా పాటలు రావడం కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం పూర్తిగా మాస్ ప్రేక్షకులు మెచ్చేలా తీసి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు.

నటీనటుల పనితీరు: బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకావాలనే కోరిక ఈ సినిమాలో మనకు బలంగా కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కోసమే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. నటన పరంగా బెల్లంకొండ కొంత పరిణితి చెందాడు. ఎమోషన్ డైలాగ్స్ విషయంలో కాస్త తడబడ్డాడు. పూజా హెగ్డే  గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది.  నలుగురు విలన్లు ఉన్నప్పటికీ, ఫోకస్ అంతా జగపతిబాబుపైనే పెట్టాడు దర్శకుడు. విలన్ పాత్రలో జగపతిబాబు తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్, పంచభూతాల చుట్టే తిరుగుతుంది. మిగతావారి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లినట్టుగా ఉంటాయి.

పాజిటివ్ పాయింట్స్: పంచభూతాల కాన్సెప్ట్ , హీరో యాక్షన్ , నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్: లవ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాట‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here