వాట్ యాన్ ఐడియా స‌ర్‌జీ! మ‌ర్రి చెట్టుకు సెలైన్ బాటిళ్లు!

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌: పిల్ల‌ల‌మ‌ర్రి. ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద మ‌ర్రిమాను. సుమారు మూడెక‌రాల్లో విస్త‌రించి ఉందీ మ‌హావృక్షం. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ గ‌ర్వ‌కార‌ణ‌మైన చారిత్రాత్మ‌క మ‌హావృక్షం. సుమారు 700 సంవ‌త్స‌రాల‌కు పైగా చ‌రిత్ర ఉన్న పిల్ల‌ల‌మ‌ర్రి చెట్టుకు ప్ర‌స్తుతం కాలుష్యం బారిన ప‌డింది. మోడువారి పోతోంది.

దీన్ని ప‌రిర‌క్షించుకోవ‌డానికి తెలంగాణ అట‌వీశాఖ అధికారులు న‌డుం బిగించారు. ఈ మ‌హావృక్షానికి ఏకంగా సెలైన్ బాటిళ్ల‌ను ఎక్కిస్తున్నారు. చెట్ల కొమ్మలు ఎక్క‌డెక్క‌డ వాడిపోయాయో, ఎక్క‌డెక్క‌డ చెద‌లు ప‌ట్టాయో, అలాంటి చోట సెలైన్‌ను వాడుతున్నారు.

జిల్లా కేంద్రానికి స‌రిగ్గా 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పిల్ల‌లమ‌ర్రి వృక్షం మొద‌లు ఎక్క‌డో క‌నుక్కోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. చెట్టుకు పట్టిన చీడలను నివారించ‌డానికి సెలైన్ బాటిళ్ల‌లో పురుగుమందు క‌లిపి, చెట్ల కొమ్మ‌ల‌కు ఎక్కిస్తున్నారు. చెద‌లు తినేస్తుండ‌టంతో గ‌త ఏడాది డిసెంబరులో ఈ చెట్టుకు చెందినో భారీ కొమ్మ‌ నేలకొరిగింది.

దీనితో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వెంట‌నే త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. రసాయ‌నాల‌తో చీడ‌ను తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అది పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. దీనితో ఈ సారి ‘క్లోరోపైరిఫస్‌’ అనే పురుగుల మందును సెలైన్ల ద్వారా చెట్టుకు ఎక్కిస్తున్నారు.

క్లోరోపైరిఫ‌స్ శ‌క్తిమంత‌మైన పురుగుల నాశిని. ఎక్క‌డెక్క‌డ చీడ ప‌ట్టిందో అక్క‌డ ఈ పురుగుల మందును సెలైన్ బాటిళ్ల ద్వారా ఎక్కిస్తుండ‌టంతో.. క్ర‌మంగా ఆ కొమ్మ‌లు పున‌రుజ్జీవితాన్ని పొందుతున్నాయి. చీడ తొల‌గిపోతోంది.

మ‌ళ్లీ ఆకులు చిగురిస్తున్నాయి. చీడ ప‌ట్టిన స‌మ‌యంలో కొమ్మ‌లు బ‌ల‌హీన‌ప‌డ‌టం స‌హ‌జం. దీనితో బ‌రువుకు అవి విరిగిపోకుండా ఉండటానికి సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు అట‌వీశాఖ అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here