ప్లేటు ఫిరాయించిన షమీ భార్య..!

భారత క్రికెటర్ షమీ మీద అతడి భార్య హసిన్ జహాన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఏకంగా షమీ మ్యాచ్ ఫిక్సర్ అని.. భార్యనే మోసం చేసినోడు.. దేశాన్ని మోసం చేయడా అని చెప్పి అతడి పర్సనల్ లైఫ్ వ్యవహారాన్ని కూడా ప్రొఫెషన్ లైఫ్ కు తగిలిచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చించారు. అంతే కాకుండా బీసీసీఐ కూడా సీరియస్ గా పరిగణించి.. దీని మీద ఓ కమిటీని కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేట్ ఫిరాయించింది. తన భర్త మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని తాను ఎప్పుడూ అనలేదని చెప్పుకొచ్చింది.

బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల ముందు విచారణకు హాజరైన ఆమె.. తన భర్త ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడని తాను ఆరోపించానంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. తాను ఇంగ్లండ్‌ కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌ కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానని ఆమె అన్నారు. తనకు క్రికెట్ గురించి సరైన అవగాహన లేనప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎలా అంటానని ఆమె తెలిపింది. హసీన్ జహాన్ ఫోన్ ఆడియో టేపుల్లో భర్తతో నగదు గురించి గొడవపడుతున్నట్టు బీసీసీ అవినీతి నిరోధక శాఖ గుర్తించింది.

ఇది పర్సనల్ విషయం గనుక ఇక షమీ ఐపీఎల్ ఆడడానికి ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు కూడా ఎటువంటి ఆధారాలు లేకపోతే అతడికి సెంట్రల్ కాంట్రాక్టు కూడా దక్కుతుంది. త్వరలోనే కమిటీ షమీ గురించి నివేదిక ఇవ్వనుంది. ఏది ఏమైనా తాను కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి ఉండి ఉంటే ఉరి కూడా తీయమని చెప్పాడు షమీ.. అంతేకాకుండా పలువురు క్రికెటర్లు.. క్రికెట్ లెజెండ్లు.. షమీ అలాంటి వాడు కాదని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. హసీన్ పరిస్థితి చూస్తుంటే భర్త మీద ఆరోపణలు చేయాలి కాబట్టి.. ఏది పడితే అది మాట్లాడినట్లు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here