చెట్టును ఢీ కొట్టి.. చెరువులో ప‌డి..! అందులో అంద‌రూ పిల్లలే!

చిన్న పిల్ల‌ల కేరింత‌ల‌తో అప్ప‌టిదాకా సంద‌డిగా సాగిన ఆ స్కార్పియో ప్ర‌యాణం ఒక్కసారిగా మూగ‌బోయింది. అతివేగంగా వారి కొంప ముంచింది. వేగంగా వెళ్తోన్న కారుకు హ‌ఠాత్తుగా అడ్డుగా వ‌చ్చిన ఓ బాలుడిని త‌ప్పించడానికి ప్ర‌య‌త్నించిన డ్రైవ‌ర్‌.. అదుపు కోల్పోయాడు. వేగంగా ఓ చెట్టును ఢీ కొట్టిన కారు.. దానికి ఆనుకునే ఉన్న ఓ చెరువులో బోల్తా కొట్టింది.

ఈ ఘ‌ట‌నలో కారులో ఉన్న ఆరుగురు పిల్ల‌లు జ‌ల స‌మాధి అయ్యారు. బిహార్‌ అరారియా జిల్లాలోని ధ‌బారా-చిక్నీ గ్రామాల మ‌ధ్య ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుల‌ను ఉదిత్‌కుమార్‌, నైనా కుమారి, మిథున్ కుమార్‌, క‌ర‌ణ్‌కుమార్‌, నితీష్ రుషిదేవ్‌, అజ‌య్‌కుమార్‌గా గుర్తించారు. వారిలో నితీష్‌, అజ‌య్‌కుమార్ వ‌య‌స్సు 14 సంవ‌త్స‌రాలు కాగా.. మిగిలిన వారు ప‌దేళ్ల‌లోపు పిల్ల‌లు.

ఓ శుభకార్యానికి హాజరైన పిల్ల‌లు స్కార్పియోలో తిరిగి వ‌స్తుండ‌గా.. తారాబాడీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ద‌భారా గ్రామం స‌మీపంలో ప్ర‌మాదానికి గురైంది. చెట్టును ఢీ కొట్టి, చెరువులో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ మిన‌హా ఆరుమంది పిల్ల‌లు మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే తారాబాడీ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

కొస ప్రాణాల‌తో ఉన్న డ్రైవ‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పిల్ల‌ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా విషాదాన్ని నింపింది. అప్ప‌టిదాకా పెళ్లిలో త‌మ‌తో పాటు ఆనందంగా గ‌డిపిన పిల్ల‌లు ఇక లేర‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక‌.. వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here