తండ్రిని న‌రికి, ఇంట్లోనే పాతిపెట్టాడు..వారంరోజుల త‌రువాత గానీ త‌ల్లికి తెలియ‌రాలేదు!

ఆస్తి గొడ‌వ‌ల్లో తండ్రిని క్రూరంగా చంపాడో యువ‌కుడు. మృత‌దేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. తండ్రి క‌నిపించ‌ట్లేదేమిటంటూ త‌ల్లి అడిగితే బుకాయిస్తూ వ‌చ్చాడు.

వారం రోజుల పాటు ఆమెను మాయ‌మాట‌ల‌తో మోస‌గిస్తూ వ‌చ్చాడు. చివ‌రికి- ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో ఆమెలో అనుమానం రేకెత్తింది.

పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ల‌హండి జిల్లాలో చోటు చేసుకుంది.

కుమారుడి చేతిలో దారుణంగా హ‌త్య‌కు గురైన ఆ తండ్రి పేరు జ‌గ‌న్నాథ్ బాఘ్‌. జిల్లాలోని నార్ల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బ‌డ‌గుండూరి గ్రామ నివాసి.

భార్య‌, కుమారుడు నాభిద‌త్య బాఘ్‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌ని పేరిట కాస్త పొలం ఉంది. ఈ పొలాన్ని త‌న పేరిట బ‌ద‌లాయించాలంటూ గొడ‌వ ప‌డుతుండేవాడు.

ఈ విష‌యంలో వారం రోజుల కింద‌ట ఘ‌ర్ష‌ణ ప‌డి తండ్రిని హ‌త‌మార్చాడు. మృత‌దేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. త‌ల్లితో పాటు ఇరుగుపొరుగు వారు అడిగితే ఏదో ఒక స‌మాధానం చెప్పి త‌ప్పించుకునే వాడు.

ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో త‌ల్లితో పాటు, ఇరుగుపొరుగు వారు అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

నార్ల పోలీసులు ఇంటిని త‌వ్వి చూడ‌గా.. జ‌గ‌న్నాథ్ బాఘ్ మృత‌దేహం ల‌భించింది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే నాభిద‌త్య ప‌రార‌య్యాడు. నార్ల పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here