కారం పూసిన క‌ర్ర‌తో కొడుతున్నాడంటూ క‌న్న‌తండ్రిపై కుమారుడి ఫిర్యాదు

క‌రీంన‌గ‌ర్‌: తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తొమ్మిదేళ్ల కుమారుడిపై కాఠిన్యం చూపించాడో కిరాత‌క తండ్రి. మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టాడు.

క‌ర్ర‌కు కారం పూసి మ‌రీ త‌న‌ను కొట్టేవాడ‌ని, ఈ తండ్రి త‌న‌కు వ‌ద్దంటూ విల‌పించిన ఆ బాలుడిని చూసి పోలీసుల క‌ళ్లు కూడా చెమ‌ర్చాయి. ఈ ఘ‌ట‌న జిల్లాలోని జ‌మ్మికుంట‌లో చోటు చేసుకుంది. ఆ కిరాత‌క తండ్రి పేరు శ్రీ‌నివాస్‌.

జమ్మికుంట స‌మీపంలోని మోత్కులగూడెంలో భార్య ర‌మ్య‌, కుమారుడు శ‌శికుమార్‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. ర‌మ్య కూలి ప‌ని చేస్తుంటారు. శ్రీ‌నివాస్ తాపీ మేస్త్రీ. మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డాడు.

తొమ్మిదేళ్ల శశికుమార్ మోత్కుప‌ల్లిగూడెం ప్ర‌భుత్వ‌ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్నాడు. శ‌శికుమార్ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో శ్రీ‌నివాస్ ఒక్క‌డే ఇంట్లో ఉన్నాడు.

కూలీ ప‌నికి వెళ్లిన త‌ల్లి ర‌మ్య ఇంకా రాలేదు. ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించాడనే కార‌ణంతో శ్రీ‌నివాస్ త‌న కుమారుడిని చిత‌క‌బాదాడు. కారం పూసిన క‌ర్ర‌తో ఇష్టానుసారంగా కొట్టాడు. దీనితో శశికుమార్ కాళ్లు, తుంటిపై తీవ్ర గాయాలయ్యాయి.

తప్పించుకునేందుకు ప్రయత్నించగా గది తలుపులకు గొళ్లెం వేసి కొట్టాడని శశికుమార్‌ కన్నీరు పెట్టాడు. శ‌శికుమార్ కేక‌లు విని వనజ అనే మ‌హిళ త‌లుపుల‌ను తీసి తనను కాపాడిందని శ‌శికుమార్ పోలీసుల వ‌ద్ద విల‌పించాడు.

త‌ల్లిని కూడా రోజూ కొట్టేవాడ‌ని చెప్పాడు. తాను తండ్రితో ఉండనని, తనను వసతి గృహంలో చేర్పించాలని సీఐని వేడుకున్నాడు. బాలుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here