పంచ భూతాలు సాక్ష్యంగా… నిర్మాత. అభిషేక్ నామ

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా  శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషక్ నిర్మించిన  చిత్రం సాక్ష్యం.  నెల 27న విడుదలకానుంది. ఈ సందర్బంగా అభిషేక్ నామా పాత్రికేయులతో ముచ్చటించారు.

పంచభూతాల కథాంశంతో భారతీయ తెరపై వచ్చిన తొలి సినిమా ఇది. నాలుగు దిక్కుల నుంచి ఎవరూ చూడటం లేదని కొందరు తప్పులు చేస్తారు. కానీ ఐదో దిక్కు అయిన కర్మసాక్షి వారిని గమనిస్తుంటుంది. పాపం పండిన రోజు ప్రకృతి తప్పుచేసిన వారిని శిక్షిస్తుందనే పాయింట్‌తో దర్శకుడు శ్రీవాస్ ఈ కథను సిద్ధంచేశారు. అతడు చెప్పిన పాయింట్‌లోని కొత్తదనం నచ్చి ఈ సినిమా చేశాను. వీడియోగేమ్ డిజైనర్‌గా పనిచేసే యువకుడి జీవితం విధి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆకట్టుకుంటుంది. ప్రేమకథ, కుటుంబ బంధాలు, యాక్షన్ హంగులతో విందుభోజనంలా ఉంటుంది.

కథ డిమాండ్ మేరకే బడ్జెట్ విషయంలో రాజీపడకుండా ఈ సినిమా చేశాను. హైదరాబాద్‌లోనే సినిమాను చిత్రీకరించి కాశీ, అమెరికా అని చెప్పి ప్రేక్షకుల్ని చీటింగ్ చేయవచ్చు. కానీ కథానుగుణంగా నిజమైన లొకేషన్స్‌లోనే షూటింగ్ చేశాం. కథ మొదలుకొని నిర్మాణం వరకు ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. రిస్క్ అనే ఆలోచన లేకుండా మంచి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాలో పంచభూతాల నేపథ్యంలో వచ్చే గ్రాఫిక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రొమాంటిక్ ఎపిసోడ్స్, యాక్షన్ ఘట్టాల్లో చక్కటి ప్రతిభను కనబరిచారు. శారీరకంగా దృఢంగా కనిపించడానికి సిక్స్‌ప్యాక్ చేశాడు. నటుడిగా అతడిని మరో మెట్టెక్కిస్తుందనే నమ్మకముంది. ఇక పూజాహెగ్డే కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో పాల్గొంది.

దర్శకుడు శ్రీవాస్ డ్రీమ్ కాన్సెప్ట్ ఇది. గత సినిమాలకు భిన్నంగా ఎంతో తపనతో సినిమాను తెరకెక్కించారు. పంచభూతాలపై ఎస్.పి. బాలు, ఏసుదాసు, హరిహరన్ తదితరులు ఆలపించిన 13 నిమిషాల నిడివి గల పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో జగపతిబాబు, రవికిషన్, అశుతోష్‌రాణా, మధుగురుస్వామి నలుగురు ప్రతినాయకుల పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అభిషేక్ సంస్థ ప్రారంభమై 34 ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకు మా సంస్థపై 140 సినిమాలకుపైగా పంపిణీచేశాం. నిర్మాతగా సాక్ష్యంనా మూడో సినిమా. ఈ సినిమాతో పాటు గూఢచారి చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 3న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here