బాల్ టాంపరింగ్ తో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్నా టాప్ లోనే..!

మంచి నైపుణ్యం ఉన్న క్రికెటర్లే.. కానీ ఎలాగైనా గెలవాలని వాళ్ళు చేసిన పని వాళ్ళను నట్టేటముంచింది. ఇక్కడ చెబుతోంది వార్నర్, స్టీవ్ స్మిత్ గురించే..! ప్రస్తుతం ఏడాది పాటూ వాళ్ళు నిషేధం ఎదుర్కొంటూ ఉన్నారు. అయినప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ స్థానాలని నిలబెట్టుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో 929 పాయింట్లతో స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకో రెండు నెలల వరకూ పెద్దగా టెస్ట్ సిరీస్ లు లేకపోవడం.. టాప్-10లో ఉన్న ఆటగాళ్ళకు మ్యాచ్ లు లేకపోవడంతో స్మిత్ మరికొద్ది రోజులు నమ్వార్ వన్ గానే ఉండబోతున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి (912 పాయింట్లతో) రెండో స్థానం, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (867), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (847)లకి ఆ తర్వాత స్థానాలు దక్కాయి. 820 పాయింట్లతో నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మార్‌క్రమ్ కెరీర్‌లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. కెరీర్‌లో 10 టెస్టులు మాత్రమే ఆడిన మార్‌క్రమ్ 4 శతకాలు, మూడు అర్ధశతకాల సాయంతో మొత్తం 1,000 పరుగులు చేశాడు.

బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబాడ 897 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (891), దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్ (845), భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (844), రవిచంద్రన్ అశ్విన్ (803) టాప్-5లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ 420 పాయింట్లతో నెం. 1 స్థానంలో నిలవగా.. తర్వాత భారత స్పిన్నర్ జడేజా (390), ఫిలాండర్ (371), అశ్విన్ (367), బెన్‌స్టోక్స్‌ (328) టాప్-5లో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here