కాలేజీకి వెళ్ల‌డానికి బ‌స్‌స్టాప్‌లో నిల్చుంది..ఫ్రెండ్ క‌నిపిస్తే అత‌నితో బైక్‌పై వెళ్లింది: ఓవ‌ర్ టేక్ చేస్తూ!

హైద‌రాబాద్‌: కాలేజీలో జ‌రిగే క‌ల్చ‌ర‌ల్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనాల్సి ఉందా ఇంజినీరింగ్ విద్యార్థిని. బ‌స్సు కోసం అప్ప‌టిదాకా బ‌స్‌స్టాప్‌లో ఎదురు చూసింది. అదే స‌మ‌యానికి త‌న సీనియ‌ర్ విద్యార్థి ఒక‌రు బైక్‌పై కాలేజీకి వెళ్తూ క‌నిపించాడు. అత‌ణ్ణి ఆపి.. లిఫ్ట్ అడిగింది. అత‌నితో క‌లిసి బైక్‌పై కాలేజీకి బ‌య‌లుదేరింది. అంతే! కొద్దిసేప‌టికే ప్ర‌మాదానికి గురైందా బైక్‌.

లారీని ఓవర్ టేక్ చేస్తుండ‌గా.. ఎదురుగా మ‌రో వాహ‌నం వ‌చ్చింది. దీనితో కంగారుకు ప‌డ్డాడు లోకేశ్‌. 100 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తున్న బైక్ అదుపు త‌ప్పింది. ఇద్ద‌రూ ఎగిరి కింద‌ప‌డ్డారు. దీనితో తీవ్ర గాయాల‌పాలై సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మృత్యువాత ప‌డ్డారు. బైక్ తునాతున‌క‌లైపోయింది.

ఇందులో విషాద‌క‌ర‌మేంటంటే.. ఆ ఇంజినీరింగ్ విద్యార్థిని తండ్రి, సోద‌రి ఇదివ‌ర‌కే ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించారు. త‌ల్లితో క‌లిసి నివ‌సిస్తోందామె. ఇప్పుడు ఆమె కూడా లేక‌పోవ‌డంతో ఆ త‌ల్లి అనాథ‌గా మారింది.

ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ శివార్ల‌లోని అబ్దుల్లాపూర్ మెట్ స‌మీపంలో చోటు చేసుకుంది. మృతుల పేర్లు వైష్ణ‌వి, లోకేశ్ గౌడ్‌. వారిద్ద‌రూ విజ్ఞాన్ ఇంజినీరింగ్ క‌ళాశాల విద్యార్థులు.

విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో లోకేశ్ గౌడ్ బీఫార్మ‌శీ సెకెండ్ ఇయ‌ర్‌. అదే కాలేజీలో వైష్ణ‌వి ఇంజినీరింగ్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతోంది.

వైష్ణ‌వి త‌న త‌ల్లితో క‌లిసి వ‌న‌స్థలిపురంలో నివ‌సిస్తోంది. ఆమె తండ్రి, ఓ సోద‌రి మ‌ర‌ణించారు. త‌ల్లి చిన్న వ్యాపారం చేస్తూ కుమార్తెను చ‌దివిస్తోంది.

కాలేజీలో `విజ్ఞాన్ తరంగ్` పేరుతో యూత్ ఫెస్టివ‌ల్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్రమంలో వైష్ణ‌వి పాల్గొనాల్సి ఉంది. దీనికోసం ఆమె వ‌న‌స్థ‌లిపురం నుంచి దేశ్‌ముఖ్ గ్రామానికి సిటీ బ‌స్సులో వ‌చ్చింది.

 

దేశ్‌ముఖ్ వ‌ద్ద బ‌స్సు దిగింది. అక్క‌డి నుంచి కాలేజీ దాకా వెళ్లాలంటే.. మ‌రో బ‌స్సు ఎక్కాల్సి ఉంటుంది. దీనికోసం ఆమె వేచి చూస్తుండ‌గా.. అదే మార్గంలో లోకేశ్ గౌడ్ బైక్‌పై కాలేజీకి వెళ్తూ క‌నిపించాడు. దీనితో ఆమె లిఫ్ట్ అడిగింది. కళాశాలకు వెళ్తుండగా మార్గ‌మ‌ధ్య‌లో కవాడిపల్లి వద్ద లారీని ఓవర్‌టేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు లోకేశ్‌.

మరో వాహనం ఎదురుగా రావడంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికులు హుటాహుటిన వారిని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హయత్‌నగర్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here