సన్ రైజర్స్ బౌలింగ్ సత్తా ముందు కింగ్స్ విల విల..!

సన్ రైజర్స్ తన బౌలింగ్ బలంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టును చిత్తు చేసింది. క్రిస్ గేల్, లోకేష్ రాహుల్, ఫించ్ లాంటి విధ్వంస ఆటగాళ్ళను సైతం తమ బౌలింగ్ తో కంగారు పెట్టారు. దీంతో స్వల్ప స్కోరును కూడా చేజింగ్ చేయలేక చతికిలపడ్డారు కింగ్స్ లెవెన్ పంజాబ్..! మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ బౌలింగ్ లైనప్ ముందు కింగ్స్ నిలవలేకపోయారు 13 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.

టాస్ ఒడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ కు.. ఓపెనర్లు చేతులెత్తేశారు. శిఖర్ ధవన్ (11), కెప్టెన్ విలియమ్సన్ (0)లు త్వరగా అవుట్ అయిపోయారు. ఫామ్ లో లేని వృద్ధిమాన్ సాహా కూడా ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మనీష్ పాండే వచ్చిన లైఫ్ లను సద్వినియోగం చేసుకున్నాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 54 పరుగులు చేశాడు. షకీబల్ హసన్ 28, యూసుఫ్ పఠాన్ 21 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది.

133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఓపెనర్లు బాగానే ఆడారు. పంజాబ్ జట్టులో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (32), క్రిస్ గేల్ (23), తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లు రషీద్ ఖాన్ 3, సందీప్ శర్మ 2, బాసిల్ థంపీ 2, షకీబల్ హసన్ 2 వికెట్లు తీసుకుని పంజాబ్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా 119 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదు వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్‌పూత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here