దాదాపు ప్లే ఆఫ్స్ చేరిపోయిన హైదరాబాద్.. ఆర్సీబీ రాత మారలేదు..!

సన్ రైజర్స్ హైదరాబాద్.. బ్యాట్స్మెన్ చేతులెత్తేసినా.. బౌలర్లు మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను ముగించేశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరిపోయినట్లే..! క్వాలిఫికేషన్ కు కావాల్సిన కనీస పాయింట్లు 16 హైదరాబాద్ సొంతమయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా ఆర్సీబీ రాత మారలేదు.. బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆకట్టుకున్నా ఒక దశలో మంచి పొజిషన్ లో ఉన్నా కూడా ఆర్సీబీ ఓటమిని ఎదిరించలేకపోయింది. 10 మ్యాచ్ లలో కేవలం మూడే మూడు విజయాలతో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లూ గెలిచి.. నెట్ రన్ రేట్ బాగా ఉంటేనే ఆర్సీబీకి అవకాశాలు ఉంటాయి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీకి బౌలర్లు మంచి ఆరంభాన్నే అందించారు. హేల్స్, ధావన్, మనీష్ పాండేలు తక్కువ స్కోరుకే అవుట్ అవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలం అయింది హైదరాబాద్. విలియమ్సన్ 56, షకిబ్ 35 పరుగులతో రాణించారు. చివర్లో కూడా అనవసరంగా వికెట్లు చేజార్చుకున్నారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్.. 20 ఓవర్లు ఆడి 146 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు.

ఇక బ్యాటింగ్ ఆరంభించిన ఆర్సీబీ దూకుడుగా ఆడింది. 7 ఓవర్లలోనే 60 పరుగులు చేసి.. విజయం తేలికగా కనిపించింది. 10 ఓవర్ ముగుస్తుందనగా 74 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ మూడో వికెట్ గా వెనుదిరగడంతో ఆర్సీబీ పతనం ఆరంభం అయింది. చివర్లో కోలిన్ డి గ్రాండ్ హోమ్ రషీద్ ఖాన్ కు ఒకే ఓవర్ లో 2 సిక్సర్లు కొట్టి విజయానికి చెరువు చేశాడు. అయితే చివరి మూడు ఓవర్లు కౌల్, భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో మ్యాచ్ ఆర్సీబీ చేజారిపోయింది. దీంతో 5 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి చవిచూసింది. కోహ్లీ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. గ్రాండ్హోమ్ 33 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here