బెట్టింగ్ ఆరోపణలతో జేసీ అనుచరుడు కొండసాని సురేష్ అరెస్ట్.. పుట్టపర్తి టీడీపీ టికెట్ ఆశిస్తున్నందుకేనా..!

జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అయిన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు కారణం క్రికెట్ బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో మంచి పలుకుబడిగా ఉన్న నేతగా కొండసాని సురేష్ కు పేరు ఉంది. అలాంటి కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

గతంలో చాలాకాలం పాటు జేసీకి అధికారిక పీఏగా పని చేసిన సురేష్ రెడ్డి, ఇప్పుడు ఆయన వెంటే అనుచరుడిగా ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడిని విచారించిన పోలీసులు, ఆయన ఇచ్చిన సమాచారంతోనే సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జేసీకి పీఏగా పనిచేసిన తరువాత, పంచాయితీ రాజ్ శాఖలో ఇంజనీర్ గా పని చేశారు.

కొండసాని సురేష్ వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొండసాని సురేష్ టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా పుట్టపర్తి నియోజకవర్గం ప్రాంతంలో ఎమ్మెల్యే లేకుండానే పలు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కొండసాని సురేష్. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కూడా ఎదుగుతున్నారు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా కొండసానికి మద్దతు తెలిపారు. అతను టికెట్ ఆశించడంలో తప్పేమీ లేదని కూడా జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటువంటి తరుణంలో కొండసాని అరెస్ట్ అవ్వడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆయన్ను పోటీగా భావించిన వారే ఈ అరెస్ట్ కు కారణం అయి ఉంటారని కొండసాని అభిమానులు అంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here