వార్నీ! ఏసీ మిష‌న్‌కు, మ‌నిషికి తేడా లేదా! డాక్ట‌ర్ వేషం క‌ట్టిన ఏసీ మెకానిక్! బాలుడి చావుకు

కోల్‌క‌త‌: ఏసీ మిష‌న్‌కు, మ‌నిషికి తేడా తెలియ‌క పోతే ఎట్టా! ఏసీ మిష‌న్‌కు చేసిన‌ట్టే మ‌నిషి పార్టుల‌న్నీ తీసి, మ‌ళ్లీ అతికించ‌డం చాలా సుల‌భమేన‌ని అనుకున్న‌ట్టున్నాడో మెకానిక్‌. ఆ మెకానిక్ కాస్తా డాక్ట‌ర్ అవ‌తారం ఎత్తాడు. మెడ‌లో స్టెత‌స్కోప్‌, ఒంటిపై తెల్ల‌రంగు కోట్ వేసుకుని, టిప్‌టాప్‌గా త‌యార‌య్యాడు.

 

క్లినిక్ పెట్టుకున్నాడు. ఓ బాలుడికి తెలిసీ తెలియ‌ని ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఈ ట్రీట్‌మెంట్ దెబ్బ‌కు చచ్చూర‌కున్నాడా బాలుడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో చోటు చేసుకుంది. బుర్ద్వాన్‌కు చెందిన అర్జిత్‌ దాస్ అనే బాలుడు అనారోగ్యానికి గురవడంతో అతడి కుటుంబసభ్యులు స్థానిక అన్నపూర్ణ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు.

 

స‌ర్ఫ‌రాజుద్దీన్ అనే డాక్ట‌ర్ అత‌నికి వైద్యం చేశాడు. అయినా త‌గ్గ‌క‌పోవ‌డంతో మెరుగైన చికిత్స కోసం కోల్‌క‌త‌కు తీసుకెళ్లాల‌ని సూచించాడు. అర్జిత్‌దాస్‌తో పాటు అంబులెన్స్ ఎక్కాడు. అర్జిత్‌దాస్ కుటుంబ స‌భ్యుల‌ను వేరే వాహ‌నంలో ర‌మ్మ‌ని సూచించాడు. అత‌ను చెప్పిన‌ట్టే చేశారు అర్జిత్ త‌ల్లిదండ్రులు. అంబులెన్స్‌లో అర్జిత్‌దాస్‌తోపాటు స‌ర్ష‌రాజుద్దీన్ ఉన్నారు.

నర్సింగ్‌హోం సిబ్బందే ఓ అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌ ఖర్చుల కోసం స‌ర్ఫ‌రాజుద్దీన్‌ అర్జిత్‌ తండ్రి నుంచి 16 వేల రూపాయ‌ల‌ను కూడా తీసుకున్నాడు. కోల్‌కతాలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అర్జిత్‌ అప్పటికే చనిపోయినట్లు అక్కడి డాక్ట‌ర్లు చెప్పారు.

స‌ర్ఫ‌రాజుద్దీన్ ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చిన రంజిత్ దాస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనితో అస‌లు విష‌యం బ‌ట్టబ‌య‌లైంది. డబ్బు కోసం అత‌ను డాక్ట‌ర్‌గా అవ‌తారం ఎత్తిన‌ట్టు తేలింది.

అర్జిత్‌ను అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో అతడికి లైఫ్‌ సపోర్టింగ్‌ను పెట్టడం తనకు రాలేదని, దీంతో అతడు చనిపోయినట్లు సర్ఫరాజ్‌ విచారణలో ఒప్పుకొన్నాడు. దీంతో సర్ఫరాజ్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌, నర్సింగ్‌హోంపై పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. అంబులెన్స్‌లో ఉన్నది అసలు డాక్టరే కాదని ఓ మెకానిక్‌ అని తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here