ఖ‌ద్ద‌రు చొక్కా..నెత్తిన గాంధీ టోపి! కాంగ్రెస్ నేత‌లు కాదు.. తెలుగుదేశం ఎంపీలు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యులు నిన్న‌, మొన్న‌టిదాకా ఎలా ఉండేవారు? ఏ రంగు దుస్తులు ధ‌రించినా, మెడ‌లో ప‌చ్చ‌కండువా మిళమిళ మంటూ మెరిసిపోయేది. త‌ళుక్‌, త‌ళుక్‌మంటూ క‌ళ్ల‌ను మిరుమిట్లు గొలిపేది. 24 గంట‌లు గ‌డిచే స‌రికి టీడీపీ ఎంపీల దుస్తులు మారిపోయాయి. వ్య‌వ‌హార శైలీ భిన్నంగా త‌యారైంది. కొత్త, కొత్త అల‌వాట్ల‌ను అల‌వ‌ర్చుకున్నారు.

ఖ‌ద్ద‌రు చొక్కా వేసుకున్నారు. నెత్తిన గాంధీ టోపీ పెట్టుకున్నారు. ఫ‌క్తు కాంగ్రెస్ నేత‌ల్లాగా మారిపోయారు. రాజ్‌ఘాట్ వ‌ద్ద మ‌హాత్ముడికి నివాళి అర్పించారు. వారి వ్య‌వ‌హార శైలి చూస్తోంటే కాంగ్రెస్‌కు ద‌గ్గ‌రైన‌ట్టే క‌నిపిస్తోంది.

నాలుగేళ్ల పాటు అధికారాన్ని అప్ప‌నంగా అనుభ‌వించిన త‌రువాత‌.. ఎన్నిక‌ల ముంగిట్లో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు ప్ర‌త్యేక హోదా గుర్తుకొచ్చింది.

పోరాటాలు గుర్తుకొచ్చాయి. ఏదో నిద్ర‌లో నుంచి లేచిన‌ట్టుగా హ‌ఠాత్తుగా మంచం దిగి.. హోదా కోసం పోలోమంటూ రోడ్డుమీదికి ప‌రుగులు తీస్తున్నారు. సైకిల్ ర్యాలీలు చేప‌ట్టారు. దీనికి వారు చెప్పే కార‌ణం ఒక్క‌టే. బీజేపీ మోస‌గించింద‌ని. బీజేపీ మోసం చేసింద‌నే విష‌యం నాలుగేళ్ల త‌రువాత‌.. ఎన్నిక‌ల ముంగిట్లో గుర్తుకొచ్చిందా? అనే అనుమానం మ‌న‌కు రాకూడ‌దంతే.

అలా అనుమానం వ‌చ్చిన వాడు రాష్ట్రాభివృద్ధికి వ్య‌తిరేకి అనే ముద్ర వేస్తారు. అద‌లావుంచితే- మొన్న‌టిదాకా త‌ల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోప‌ణ‌లు చేసిన తెలుగుదేశం త‌మ్ముళ్లు.. ఇప్పుడ‌దే త‌ల్లి కాంగ్రెస్‌ను భుజానికెత్తుకునే ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించార‌నే అనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here