సినిమా థియేట‌ర్‌లో పార్కింగ్ గొడ‌వ‌! మేనేజ‌ర్‌పై పిడిగుద్దులు..ఆసుప‌త్రికి వెళ్లే లోపే!

వికారాబాద్‌: సినిమా థియేట‌ర్‌లో వాహ‌నం పార్కింగ్ వ‌ద్ద త‌లెత్తిన వివాదం ఓ వ్య‌క్తి నిండు ప్రాణాల‌ను బ‌లిగొంది. పార్కింగ్ డ‌బ్బులు ఎక్కువ‌గా అడుగుతున్నార‌ని, తాను చెల్లించేది లేదంటూ భీష్మించిన వ్య‌క్తిని వారించ‌బోయిన థియేట‌ర్ మేనేజ‌ర్ అత‌ని చేతిలో చావు దెబ్బ‌లు తిన్నాడు. సంఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్రాణాలు వ‌దిలాడు.

 

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుడి పేరు రాఘ‌వేంద్ర రావు. వికారాబాద్ సినీ మాక్స్ థియేట‌ర్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘ‌వేంద్ర రావు వికారాబాద్‌లో నివ‌సిస్తున్నారు. సినీమాక్స్ థియేట‌ర్‌లో ఆదివారం రాత్రి ప్రేక్ష‌కుల తాకిడి భారీగా ఏర్ప‌డింది.

అదే స‌మ‌యంలో రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి అనే కాంట్రాక్ట‌ర్ త‌న కుటుంబంతో క‌లిసి కారులో సినీ మాక్స్ థియేట‌ర్‌కు వ‌చ్చారు. కారున పార్క్ చేయ‌గా..అక్క‌డి సిబ్బంది పార్కింగ్ ఛార్జీగా 30 రూపాయ‌లు అడిగాడు. ఆ మొత్తాన్ని ఇవ్వ‌డానికి రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి అంగీక‌రించ‌లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 20 రూపాయ‌లే ఇవ్వాల్సి ఉంటుంద‌ని గొడ‌వ పెట్టుకున్నాడు.

ఈ విష‌యం తెలిసిన మేనేజ‌ర్ రాఘవేంద్ర రావు ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సంవ‌త్స‌రం నుంచి 30 రూపాయ‌ల‌ను కారు పార్కింగ్ ఛార్జిగా వ‌సూలు చేస్తున్నామంటూ రాఘ‌వేంద‌ర్ రావు సూచించారు. దీనితో మ‌రింత ఆగ్ర‌హించిన రాజ‌వ‌ర్ధ‌న్ రెడ్డి అత‌నిపై దాడి చేశాడు. ఛాతి, క‌డుపులో కొట్టాడు. ప‌దే ప‌దే ఛాతీపై కొట్ట‌డంతో అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు.

వెంట‌నే థియేట‌ర్ సిబ్బంది ఆయ‌న‌ను స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌టనాస్థ‌లానికి చేరుకుని రాజవర్ధన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here