50 అడుగులకు పైగా లోతు ఉన్న పురాత‌న బావి! శుద్ధి కోసం దిగి!

క‌ల‌బుర‌గి: శుద్ధి చేయ‌డానికి బావిలోకి దిగిన ముగ్గురు కార్మికులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న కర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గి జిల్లా కెవ‌ల‌గావ్‌లో చోటు చేసుకుంది. ఆ ముగ్గురిలో ఇద్ద‌రు తండ్రి, కుమారుడు కావ‌డం ఆ గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. కేవ‌ల్‌గావ్ గ్రామంలోని ఆల‌యం వ‌ద్ద ఉండే పురాతన బావి స్థానికుల‌కు ఆధారం.

కొద్దిరోజులుగా బావిలో పూడిక పేరుకు పోవడంతో దాన్ని శుభ్రం చేయాల‌ని నిర్ణ‌యించారు. గ్రామానికే చెందిన చెన్న‌ణ్ణ గౌడ‌, అత‌ని కుమారుడు మ‌ల్ల‌న్న గౌడ‌లకు ఈ ప‌ని అప్ప‌గించారు. ముందుగా- మ‌ల్ల‌న్న‌గౌడ బావిలోకి దిగాడు. చాలాసేప‌టి త‌రువాత గానీ వారి వ‌ద్ద నుంచి ఎలాంటి స‌మాచారం లేకపోవ‌డంతో చెన్న‌ణ్ణ గౌడ బావిలోకి దిగారు.

అత‌ని స‌మాచారం కూడా లేక‌పోవ‌డంతో మ‌హ‌మ్మ‌ద్ అనే వ్య‌క్తి కూడా అందులోకి దిగాడు. బావిలో వెలువ‌డిన విష‌వాయువుల ప్ర‌భావానికి ఆ ముగ్గురూ మ‌ర‌ణించారు. సుమారు 50 అడుగుల‌కు పైగా లోతు ఉన్న బావి అది. ఇద్ద‌రు మ‌నుషులు ప‌ట్టేంత స్థ‌లాన్ని వ‌దిలి మిగిలిన బావినంత‌టినీ పూడ్చేశారు.

గంట‌లు గ‌డిచిన‌ప్ప‌టికీ.. వారి జాడ లేక‌పోవ‌డంతో గ్రామ‌స్తులు ఫ‌ర‌హ‌తాబాద్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది బావిలోకి దిగి, ముగ్గురి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. ఈ ఘ‌ట‌న‌తో కేవ‌ల్‌గావ్‌లో విషాద‌ఛాయ‌లు నెల‌కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here