ప్రేక్ష‌కుల‌ను విషాదంలో ముంచిన హాస్య‌న‌టుడు

హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు గుండు హ‌నుమంత‌రావు ఇక లేరు. సోమ‌వారం తెల్ల‌వారు జామున ఆయ‌న ఎర్ర‌గ‌డ్డ‌లోని సెయింట్ థెరిసా ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు.

కొంత‌కాలంగా ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొద్దిరోజుల కింద‌ట చికిత్స తీసుకున్నారు.

ఆరోగ్యం మెరుగు ప‌డ‌టంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున గుండు హ‌నుమంత‌రావు మ‌రోసారి అనారోగ్యానికి గురయ్యారు.

వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను ఎర్ర‌గ‌డ్డ సెయింట్ థెరిసా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చేరిన కొద్దిసేప‌టికే ఆయ‌న త‌న తుదిశ్వాస విడిచారు.

ఈ స‌మాచారం తెలుసుకున్న వెంటనే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు గుండు హ‌నుమంత‌రావు భౌతిక కాయాన్ని సంద‌ర్శించారు. నివాళి అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య‌మంత్రి సహాయనిధి నుంచి అయిదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది.

గుండు హ‌నుమంత‌రావు ఒక‌ద‌శ‌లో టాప్ క‌మేడియ‌న్‌గా కొన‌సాగారు. కెరీర్‌లో 400లకు పైగా చిత్రాల్లో హస్యానికి ప్రాణం పోశారు. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆయ‌న కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బుల్లితెర‌పైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో కామెడీని పండించారు. ప్ర‌త్యేకించి- `అమృతం` సీరియ‌ల్ టీవీ వీక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

 

బాబాయ్‌ హోటల్‌, కొబ్బరి బోండా, యమలీల, చినబాబు, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లి కాని ప్రసాద్‌, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మృగరాజు, రిక్షావోడు, కలిసుందాం రా, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, పాపారావు, మావిచిగురు, ఆలస్యం అమృతం, క్రిమినల్‌, పెళ్లా ఊరెళితే, బాలు తదితర చిత్రాల్లో హనుమంతరావు నటనకు మంచి గుర్తింపు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here