టాప్ తెలుగు న్యూస్ ఛాన‌ల్ యాంక‌ర్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌: వీ6 టీవీ న్యూస్ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తోన్న యాంక‌ర్, న్యూస్ రీడ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మూసాపేట్‌లోని అపార్ట్‌మెంట్ అయిదో అంత‌స్తు నుంచి కిందికి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల స‌రైన కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేదు గానీ.. డిప్రెష‌న్ కార‌ణ‌మై ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆమె పేరు రాధిక రెడ్డి. 30 సంవ‌త్స‌రాలు.

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేపల్లి ఆమె స్వ‌స్థ‌లం. ప‌దేళ్ల కింద‌ట ఆమెకు వివాహ‌మైంది. రాధికా రెడ్డి దంప‌తుల‌కు ఓ కుమారుడు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా రాధికా రెడ్డి కొంత‌కాలంగా భ‌ర్త‌కు దూరంగా ఉంటున్నారు. ఆరునెల‌ల కిందటే విడాకులు తీసుకున్నార‌ని కూడా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఆమె త‌న తండ్రి, సోద‌రి, కుమారుడితో క‌లిసి మూసాపేట్ గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని సువీలా అపార్ట్‌మెంట్ అయిదో అంత‌స్తులో నివసిస్తున్నారు. అయిదేళ్లుగా ఆమె ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు. భ‌ర్త‌తో వేరుప‌డ‌టం, కుమారుడికి మాన‌సిక స‌మ‌స్య‌లు ఉండ‌టం వ‌ల్ల రాధికారెడ్డి కొంత‌కాలంగా డిప్రెష‌న్‌లో ఉంటున్నార‌ని చెబుతున్నారు.

ఆదివారం రాత్రి 10:20 నిమిషాల‌కు ఛాన‌ల్ కార్యాల‌యం నుంచి ఇంటికి వ‌చ్చిన ఆమె..భోజ‌నం చేయ‌కుండా ముభావంగా ఉన్నారు. తండ్రి, సోద‌రి ఏమైంద‌ని ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ.. ముభావంగానే స‌మాధానం ఇచ్చారు. ఆ త‌రువాత ప‌ది నిమిషాల వ్య‌వ‌ధిలోనే రాధికారెడ్డి.. అపార్ట్‌మెంట్ అయిదో అంత‌స్తు నుంచి కిందికి దూకారు. ఆమె త‌ల ముందుగా నేల‌కు త‌గిలింది.

దీనితో ఆమె అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. రాధికారెడ్డి హ్యాండ్‌బ్యాగ్‌లో ఆత్మ‌హ‌త్య లేఖ ల‌భించింది. త‌న చావుకు ఎవ‌రూ కార‌ణం కాద‌ని, త‌న బ్రెయినే త‌న మొద‌టి శ‌తృవు అని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాను.. అని అందులో రాసి ఉంది. రాధికారెడ్డి కింద ప‌డ‌టాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు.. సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకునే లోపే.. ఆమె మ‌ర‌ణించారు.

 

ఆ దృశ్యాన్ని చూసిన ఆమె తండ్రి, సోద‌రి కుప్ప‌కూలిపోయారు. స్థానికులు కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆమె మృత‌దేహాన్ని, ఆత్మ‌హ‌త్య లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె మ‌ర‌ణంతో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here