బంగ్లాను సమిష్టిగా చిత్తుచేశారుగా..!

శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన భారత్.. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. బ్యాట్స్మెన్, బౌలర్లు రాణించడంతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 140 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ తీసుకుంది. 20 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు సౌమ్య సర్కార్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. ఆ తర్వాత మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (15) కూడా అవుటయ్యాక బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయదేవ్ ఉనద్కత్, విజయ్ శంకర్, స్పిన్నర్లు చాహల్, సుందర్ తమ బౌలింగ్ తో బంగ్లా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టారు. లిటన్ దాస్ (34), షబ్బీర్ రహ్మాన్ (30) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి భారత్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీసుకోగా, విజయ్ శంకర్ రెండు, శార్ధూల్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరో సారి తొందరగా అవుట్ అయ్యాడు. మొదటి టీ20లో కదం తొక్కిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్ తో అలరించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 28, మనీశ్ పాండే 27 పరుగులు చేశారు. ఫలితంగా మరో 8 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ విజయాన్ని అందుకుంది. రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న విజయ్ శంకర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here