ఆ ఫ్లాట్ నుంచి దుర్గంధం..త‌లుపులు ప‌గుల‌గొట్టి చూసిన పోలీసులు ఉలిక్కిప‌డ్డారు!

హైద‌రాబాద్‌: త‌న‌కు తెలియ‌కుండానే ఓ వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుందో యువ‌తి. తాను స‌వతిగా ఆ ఇంటికి వెళ్లాన‌నే విష‌యం తెలుసుకున్న త‌రువాత భ‌ర్త‌తో గొడ‌వ ప‌డ్డారు. వేరుగా నివసించ‌సాగారు. విధి లేని ప‌రిస్థితుల్లో స‌ర్దుకుపోయారు.

పెళ్ల‌యిన ఆరేళ్ల త‌రువాత దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ యువ‌తి ఒక్క‌రే కాదు.. ఆమె త‌ల్లి, కుమార్తెతో క‌లిసి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల చేతిలో దారుణంగా హ‌త‌మ‌య్యారు.

 

బెడ్‌రూమ్‌లో మంచంపై త‌ల్లి, కుమార్తె మృత‌దేహాలు ల‌భించ‌గా.. వంట‌గ‌దిలో ఆ యువ‌తి మృత‌దేహం అర్ధ‌న‌గ్నంగా క‌నిపించింది.

హైద‌రాబాద్ చందాన‌గ‌ర్‌లో ఈ ట్రిపుల్ మ‌ర్డ‌ర్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తుల పేర్లు అప‌ర్ణ‌, విజ‌య‌ల‌క్ష్మి. నాలుగేళ్ల కుమార్తె పేరు తెలియ రావాల్సి ఉంది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన అప‌ర్ణ ప‌దేళ్ల కింద‌ట హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తూ, చందాన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు.

ఆరేళ్ల కింద‌ట ఆమె ముర‌ళి అనే వ్య‌క్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇదివ‌ర‌కే ముర‌ళి వివాహితుడు. అత‌నికి భార్య‌, పిల్ల‌లు ఉన్నారు.

ఈ విషయం అప‌ర్ణ‌కు తెలియ‌దు. త‌న‌కు పెళ్ల‌యిన విష‌యాన్ని దాచి పెట్టి మ‌రీ.. అప‌ర్ణ‌ను రెండోపెళ్లి చేసుకున్నాడు ముర‌ళి. ఈ విష‌యం తెలిసిన త‌రువాత అప‌ర్ణ భ‌ర్త‌తో గొడ‌వ ప‌డ్డారు.

వేమ‌కుంట‌లోని అపార్ట్‌మెంట్‌లో నివ‌సించ‌సాగారు. ముర‌ళి త‌ర‌చూ ఆ ఇంటికి వ‌చ్చేవాడు. పెళ్లయిన రెండేళ్ల త‌రువాత ముర‌ళి, అప‌ర్ణ దంప‌తుల‌కు కుమార్తె జ‌న్మించారు.

ప్ర‌స్తుతం ఆ చిన్నారి వ‌య‌స్సు నాలుగేళ్లు. త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, కుమార్తెతో క‌లిసి అప‌ర్ణ వేమ‌కుంట అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్నారు.

అప‌ర్ణ ఫోన్ ప‌నిచేయ‌క‌పోవ‌డం, ఆమె నుంచి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం, విధుల‌కు కూడా హాజ‌రు కాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన తోటి ఉద్యోగులు వేమ‌కుంట అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.

ఫ్లాట్‌కు బ‌య‌టి నుంచి గ‌డియ‌పెట్టి ఉండ‌టం, దుర్గంధం వ‌స్తుండ‌టంతో అనుమానం వ‌చ్చిన ఉద్యోగులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు త‌లుపులు ప‌గుల‌గొట్టి లోనికి వెళ్లి చూడ‌గా.. ముగ్గురి మృత‌దేహాలు క‌నిపించాయి.

బెడ్‌రూమ్‌లో అప‌ర్ణ త‌ల్లి, కుమార్తె మృత‌దేహాలు, వంట‌గ‌దిలో అప‌ర్ణ మృత‌దేహం అర్ధ‌న‌గ్నంగా పోలీసుల‌కు లభించాయి. పోలీసులు ముర‌ళి కోసం ఆరా తీస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here