డివైడ‌ర్‌ను ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి..రోడ్డుకు అవ‌త‌లి వైపు వెళ్తోన్న కారుపై ప‌డి: 8 మంది దుర్మ‌ర‌ణం!

వ‌న‌పర్తి: జాతీయ ర‌హ‌దారిపై ఉన్న డివైడ‌ర్ ఎత్తు సుమారు రెండ‌డుగులు..వెడ‌ల్పు అయిదడుగుల పైమాటే. అయిన‌ప్ప‌టికీ.. ఆ కారు వేగం ముందు అది అడ్డు కాలేదు.

అతి వేగంతో అదుపు త‌ప్పిన ఓ కారు డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. సినీ ఫ‌క్కీలో సుమారు 8-10 అడుగుల మేర గాల్లోకి పైకెగిరింది. ఆ స‌మ‌యంలో అటుగా అంతే వేగంతో వ‌చ్చిన మ‌రో కారుపై ప‌డింది.

దీని ఫ‌లిత‌మేంట‌నేది అంతుప‌ట్ట‌ని బ్ర‌హ్మ‌ప‌దార్థ‌మేమీ కాదు. ఇట్టే ఊహించుకోవ‌చ్చు. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం. వారిలో ఏడుగురు సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మర‌ణిస్తే, ఒక‌రు ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని వ‌న‌ప‌ర్తి జిల్లాలో హైద‌రాబాద్‌-క‌ర్నూలు జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది.

ప్ర‌మాద స‌మ‌యంలో రెండు కార్ల‌లోనూ 11 మంది ఉన్నారు. జిల్లాలోని కొత్తకోట మండలం కణిమెట్ట వద్ద బుధవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ముగ్గురిని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది.

స‌మాచారం తెలిసిన వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్ట‌మ్ కోసం తీసుకెళ్లారు.

మృతుల్లో కర్నూలు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన సూరిబాబు ఉన్నారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలను గుర్తించాల్సి ఉంది.

హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తున్న కారులో ఆత్మకూరు మండలం మస్తిపురం గ్రామానికి చెందిన మల్లేష్‌, కొత్తకోట మండలం అజ్జ‌కోలు గ్రామానికి చెందిన రాజు, ఆంజనేయులు, డ్రైవర్‌ వీరయ్య మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here