నేడు, రేపు బ్యాంకుల బంద్.. ఏటీఎంలు కూడా డౌటేనట.. ప్రజల కష్టాలను పట్టించుకోరా..!

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగులు.. రెండు రోజుల పాటూ సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. తమకు మరింత మెరుగైన వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ, వేతన సవరణపై చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతోనే సమ్మెకు దిగక తప్పలేదని, మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) తెలియజేసింది.

48 గంటల సమ్మెకారణంగా నేడు, రేపు (మే 30, 31) బుధ, గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకులు పని చేయవు. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేవి శుక్రవారమే. బ్యాంక్ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులు. కనీసం 5శాతం జీతాల పెంపును డిమాండ్ చేయగా.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతం మాత్రమే పెంచటానికి ఒప్పుకుంది. దీంతో సమ్మెకు పిలుపు నిచ్చారు ఉద్యోగులు. ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఈ సమ్మెకి మద్దతు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మే 30, 31 తేదీల్లో పూర్తిగా లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

అయితే ఇక ఈ రెండు రోజుల పాటు ఏటీఎంలు కూడా పని చేయవని, ప్రజలు తమ న్యాయమైన డిమాండ్లను సహృదయంతో అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నామని యూఎఫ్బీయూ పేర్కొంది. ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here