రైల్వే వంతెన‌పై తిష్ట‌వేసిన రెండు గున్నేనుగులు! అంత‌లో ఓ 60 కిలోమీట‌ర్ల వేగంతో ఎక్స్‌ప్రెస్‌!

ఎలా వెళ్లాయో గానీ రెండు గున్నేనుగులు రైల్వే వంతెనపైకి వెళ్లాయి. అక్క‌డే తిష్ట‌వేశాయి. సాధార‌ణంగా రైల్వే వంతెన‌ల‌పై అటు-ఇటు నిల్చోవ‌డానికి కూడా స‌రైన చోటు ఉండ‌దు. ఆ స‌మ‌యంలో రైలు వ‌స్తే, కిందికి దూకడం మిన‌హా మ‌రో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితి. అలాంటి చోట ఆ గున్నేనుగులు తిష్ట‌వేసుకున్నాయి.

అంత‌లో స‌గ‌టున 60 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకొచ్చింది ఓ ఎక్స్‌ప్రెస్‌. రైలు శ‌బ్దం, హార‌న్ వినిపించ‌డంతో లేచి నిల్చుంది. వంతెన కావ‌డంతో ఎటూ త‌ప్పించుకోవ‌డానికి వీలు చిక్క‌లేదు. దీనితో రైలు ఢీ కొని ఆ రెండు ఏనుగులు అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశాయి.

క‌ర్ణాట‌క‌లోని కుక్కే సుబ్ర‌హ్మ‌ణ్య రోడ్‌-స‌క‌లేశ‌పుర స్టేష‌న్ల మ‌ధ్య ఎడ‌కుమ‌రి స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బెంగ‌ళూరు-మంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టిన వేగానికి ఓ ఏనుగు ఎగిరి వంతెన మీది నుంచి కింద‌ప‌డ‌గా.. మ‌రొక‌టి సంఘ‌ట‌నాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాలైంది.

 

ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రైలు లోకో పైలెట్ ఇచ్చిన స‌మాచారంతో రైల్వే సిబ్బంది సోమ‌వారం ఉద‌యం సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అట‌వీశాఖ సిబ్బంది స‌హ‌కారంతో వాటి మృత‌దేహాల‌ను త‌ర‌లించారు. ద‌ట్ట‌మైన ప‌డ‌మ‌టి క‌నుమ‌ల్లో ఉంటుందీ ప్రాంతం. ఇక్క‌డ ఏనుగుల సంచారం ఎక్కువ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here