వివాహేత‌ర సంబంధాన్ని అంట‌గ‌ట్టార‌నే ఆవేద‌న‌తో..!

సూర్యాపేట్: ఓ వ్య‌క్తి అనుమానం ఇద్ద‌రు మ‌హిళ‌ల నిండు ప్రాణాల‌ను బ‌లిగొంది. నిరాధారంగా చేసిన ఆరోప‌ణ‌లు ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచింది. అవ‌మాన భారాన్ని త‌ట్టుకోలేక ఇద్ద‌రూ పురుగుల మందు సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామ శివార్ల‌లో బుడగజంగాల కాలనీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మృతుల పేర్లు గట్టమ్మ, స‌రోజ. వారిద్ద‌రూ వరుసకు వదినా మరదళ్లు. ఇద్ద‌రూ వేర్వేరు వ్య‌క్తుల‌తో వివాహేత‌ర సంబంధం క‌లిగి ఉన్నారంటూ అదే కాల‌నీకి చెందిన ఓ వ్య‌క్తి ఆరోపించారు. దీనితో ఈ విష‌యం పంచాయితీ వ‌ర‌కూ వెళ్లింది. దీనికితోడు ఆ ఆరోప‌ణ‌ల‌ను నిజ‌మ‌ని న‌మ్మిన వారి భ‌ర్త‌లు కూడా నిల‌దీస్తుండ‌టంతో చావే శ‌ర‌ణ్యం అనుకున్నారు. తెల్లవారు జామున బహిర్భూమికని వెళ్లి కాలనీ సమీపంలో చెట్లకింద క్రిమిసంహారక మందు తాగారు.

వారి నోట్లో నుంచి నురుగు రావడంతో గట్టమ్మ భర్త నాయ‌క్ వెంటనే విషయాన్ని కాలనీ వాసులకు చెప్పి వారిని 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. మార్గమధ్యలోనే గట్టమ్మ మ‌ర‌ణించింది. సరోజ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌కు లింగయ్య అనే వ్య‌క్తి కార‌ణ‌మ‌ని కారణమని మృతుల కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here