యువ‌తికి పెళ్లి నిశ్చ‌యం! అది ఇష్టం లేక‌..చిన్నాన్న కుమార్తెతో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌!

ఆదిలాబాద్‌: తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేని ఓ యువ‌తి త‌న చిన్నాన్న కుమార్తెతో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువతులు మ‌ర‌ణించారు.

జిల్లాలోని సిరికొండ మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుల పేర్లు అంజుల‌, అర్చ‌న‌. వారిద్ద‌రూ వ‌రుస‌కు అక్కాచెల్లెలు. అంజుల చిన్నాన్న కుమార్తె అర్చ‌న ఏడాది వ‌య‌స్సు మాత్ర‌మే తేడా. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి, మెలిసి తిరిగారు. ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. పెళ్లి పేరుతో వేరు ప‌డ‌టం ఇష్టం లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

జిల్లాలోని నేర‌డిగొండ మండ‌లం బొందిడి గ్రామానికి చెందిన కమల్‌సింగ్, భీమ్ సింగ్‌ అన్నదమ్ములు. వారి కుమార్తెలు అంజుల, అర్చన. 7వ తరగతి చదివిన అంజుల చ‌దువు మానివేసింది. అర్చన నేర‌డిగొండ‌ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

అంజులకు గ‌త ఆదివారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. తనకు పెళ్లి కొడుకు నచ్చలేదని తల్లిదండ్రులకు చెప్పిందామె. అయిన‌ప్ప‌టికీ.. త‌ల్లిదండ్రులు వినకుండా వివాహం నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంజుల త‌న చిన్నాన్న భీమ్‌సింగ్ కుమార్తె అర్చనను వెంటబెట్టుకొని ఇంట్లోంచి వెళ్లి పోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకలేదు.

దీంతో నేరడిగొండ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన అంజుల‌, అర్చ‌న హైద‌రాబాద్‌, అక్క‌డి నుంచి మ‌ళ్లీ ఆదిలాబాద్‌కు వెళ్లారు. అనంత‌రం సిరికొండ మండ‌ల కేంద్రానికి చేరుకున్నారు. గురువారం సిరికొండలో పురుగుల మందు తాగారు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్ద‌రూ మ‌ర‌ణించారు. అక్క చెల్లెలి పేరునూ, చెల్లి అక్క పేరునూ చేతులపై గోరింటాకుతో రాసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here