దేవుడి హుండీలో కండోమ్ పాకెట్లు!

దేవుడి హుండీలో కండోమ్ పాకెట్ల‌ను వేసిన అనాగరిక ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో వెలుగు చూసింది. మంగ‌ళూరు జిల్లాలోని క‌ట‌పాడి గ్రామంలో కొర‌గ‌జ్జ స్వామి ఆల‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క కోస్తా జిల్లాల్లో.. ప్ర‌త్యేకించి- మంగ‌ళూరు, ఉడుపి వంటి జిల్లాల్లో కొర‌గ‌జ్జ స్వామి ఆల‌యాలు పెద్ద సంఖ్య‌లో ఉన్నాయి.

 

భ‌గ‌వాన్ బ‌బ్బు స్వామి పేరుతో కొర‌గ‌జ్జ స్వామి ఆల‌యాల‌ను నిర్మించారు భ‌క్తులు. క‌ర్ణాట‌క‌లో ఓ సామాజిక వ‌ర్గానికి కొర‌గ‌జ్జ స్వామి కుల దైవం కూడా. గ్రామ ర‌క్ష‌క దేవుడిగా కొర‌గ‌జ్జ స్వామిని పూజిస్తారు భ‌క్తులు. క‌ట‌పాడి గ్రామంలో ఉన్న కొర‌గ‌జ్జ స్వామి ఆల‌యంలో ఉద్దేశ‌పూర‌కంగా కొంద‌రు యువ‌కులు కండోమ్ పాకెట్ల‌ను వేశారు. హుండీ స‌మీపంలోనే మూత్రం పోశారు.

 

మార్చిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విచిత్ర ప‌రిస్థితుల్లో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తాను ఉద్దేశ‌పూర‌కంగానే హుండీలో కండోమ్ పాకెట్ల‌ను వేశాన‌ని ఓ మైన‌ర్ బాలుడు చెప్పాడు. దైవ‌శ‌క్తిని ప‌రీక్షించ‌డానికి తాను ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాన‌ని, దానికి త‌గ్గ ఫ‌లితం అనుభ‌విస్తున్నాన‌ని అంటూ ఆ బాలుడు త‌ల్లిదండ్రుల‌కు వెల్ల‌డించ‌డంతో సుమారు రెండునెల‌ల త‌రువాత ఈ విష‌యం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

 

స్వామి వారి హుండీలో కండోమ్ పాకెట్ల‌ను వేసిన ఆ బాలుడి రెండు కాళ్లూ ఉన్న‌ట్టుండి చ‌చ్చుబ‌డ్డాయి. ఎలాంటి అనారోగ్య సంకేతాలు లేకుండా కాళ్లు చ‌చ్చుబ‌డ్డాయ‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. రెండువారాల పాటు ప‌లువురు డాక్ట‌ర్ల‌కు చూపించిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.

త‌మ కుమారుడు చేసిన అప‌చారాన్ని గుర్తించిన త‌ల్లిదండ్రులు కట‌పాడి గ్రామానికి చేరుకుని, కొర‌గ‌జ్జ స్వామి వారి భ‌క్తుల‌ను ఆశ్ర‌యించారు. కొర‌గ‌జ్జ స్వామి వారిని శాంతింప‌జేయాల‌నే ఉద్దేశంతో- కట‌పాడి గ్రామంలో ప్ర‌త్యేక జాత‌ర‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఆల‌య క‌మిటీ ఏర్పాట్లు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here