అతను మోస్తున్న‌ది..క‌ట్టుకున్న భార్య మృత‌దేహాన్ని!

ల‌క్నో: భేతాళుడి మృత‌దేహాన్ని విక్ర‌మార్కుడు భుజం మీద మోసుకెళ్లాడ‌నే క‌థ‌లు విన్నాం. చ‌దువుకున్నాం. అదెంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. అలాంటి విషాద‌గాథ‌లు ప‌దేప‌దే తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. గ‌తంలో ఒడిశాలో ఓ వ్య‌క్తి.. త‌న భార్య మృత‌దేహాన్ని భుజంపై మోస్తూ సుమారు 10 కిలోమీట‌ర్ల పాటు న‌డుచుకుంటూ వెళ్లాడు. ఇప్పుడూ అదే ప‌రిస్థితి.

రాష్ట్రం మారిందంతే. ఈ సారి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఓ భ‌ర్త‌.. క‌ట్టుకున్న భార్య మృత‌దేహాన్ని మోస్తూ సుమారు రెండు కిలోమీట‌ర్ల పాటు న‌డుచుకుంటూ వెళ్లాడు. కార‌ణం.. అంబులెన్స్ లేక‌పోవ‌డ‌మే. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. భార్య అనారోగ్యంతో మ‌ర‌ణిస్తే..క‌నీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయారు అక్క‌డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సిబ్బంది.

 

ఆ వ్య‌క్తి పేరు సాదిక్‌. జిల్లాలోని మూసాఝాగ్ గ్రామంలో నివ‌సిస్తుంటాడు. అనారోగ్యానికి గురైన భార్య‌ను ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మ‌ర‌ణించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ల‌డానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. ఉన్నా ఇవ్వ‌లేమ‌ని ఆసుప‌త్రి సిబ్బంది తెగేసి చెప్పారు.

దీనితో ఆసుప‌త్రి నుంచి సుమారు రెండు కిలోమీట‌ర్ల పాటు భార్య మృత‌దేహాన్ని మోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చందాలు వేసుకుని.. అత‌ణ్ని ఆటోలో పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే.. అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here