పీక్స్‌! ఆధార్‌కార్డు లేద‌ని నిండుగ‌ర్భిణికి ఆసుప‌త్రిలో నో ఎంట్రీ..దీని ఫ‌లితం?

ఆధార్‌కార్డు లింకేజీ పిచ్చి జ‌నాల‌కు బాగా ముదిరిపోయిన‌ట్టుంది. అందుకే- చివ‌రికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు కూడా ఆధార్ కార్డు చూపించ‌నిదే వైద్యం చేసే దిక్కు లేదు.

ఆధార్‌కార్డు చూపించ‌నిదే ప్ర‌స‌వం చేయ‌బోమంటూ ఆసుప‌త్రి డాక్ట‌ర్ భీష్మించుక్కూర్చున్నాడు. ఆసుప‌త్రిలో ఉండొద్దంటూ బ‌య‌టికి త‌రిమేశాడు.

ఫ‌లితంగా.. ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో, ఆరు బ‌య‌టే ఆ మ‌హిళ ప్ర‌స‌వించింది. ఈ నెల 29వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని షాహ‌గంజ్‌కు చెందిన ఓ నిండుగ‌ర్భిణి భ‌ర్త‌తో క‌లిసి ప్ర‌స‌వం కోసం ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వెళ్లారు.

అక్క‌డికి వెళ్లిన త‌రువాత డాక్ట‌ర్ ఆధార్‌కార్డు అడిగారు. ఆధార్‌కార్డు లేదంటూ ఆమె స‌మాధానం ఇవ్వ‌డంతో ప్ర‌స‌వం చేయ‌డానికి నిరాక‌రించారు.

క్ష‌ణం పాటు కూడా ఆసుప‌త్రిలో ఉండ‌నివ్వ‌లేదు. బాధితురాలి భ‌ర్త ప్రాధేయ‌ప‌డిన‌ప్ప‌టికీ వినిపించుకోలేదు. దీనితో ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఆరుబ‌య‌టే ఆ మ‌హిళ పురుడు పోసుకున్నారు.

మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఆ మ‌హిళ బంధువులు, స్థానికులు ఆందోళ‌న చేయ‌డం మొద‌లు పెట్టారు.

దీనితో డాక్ట‌ర్ ఆ మ‌హిళ‌ను ఆసుప‌త్రిలోనికి తీసుకెళ్లారు. చికిత్స అందించారు. ఈ ఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.  దీనిపై జిల్లా వైద్యాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here