ప్ర‌భుత్వ అధికారుల‌తో పెట్టుకుంటే అంతే! కారు బోనెట్‌పై ఎక్కించుకుని 4 కిలోమీట‌ర్లు..!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండో విడతగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లిన కొంద‌రు ల‌బ్ధిదారుల‌కు అక్క‌డి అధికారులు చుక్క‌లు చూపించారు.

త‌మ‌కు రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయాలంటూ ఆందోళ‌న చేస్తోన్న వారిలో ఓ యువ‌కుడిని అక్క‌డి అధికారి ఒక‌రు ఇలా కారు బోనెట్‌పై ఎక్కించుకుని సుమారు నాలుగు కిలోమీట‌ర్ల దూరం తీసుకెళ్లాడు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఈశాన్య ప్రాంతంలోని రామ్‌నగర్ బ్లాక్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రామ్‌న‌గ‌ర్‌కు చెందిన కొంద‌రు స్థానికులు వ్యక్తిగ‌త మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టుకుంటున్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ కింద ప్ర‌భుత్వం మంజూరు చేసిన టాయ్‌లెట్ల‌వి. ఇందులో రెండో విడ‌త‌గా స్థానిక బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారి పంకజ్‌కుమార్ కొంత మొత్తాన్ని విడుద‌ల చేయాల్సి ఉంది.

రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ.. రెండో విడ‌త నిధులు రాక‌పోవ‌డంతో కొంద‌రు స్థానికులు గురువారం బీడీఓ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేశారు. వారిలో బ్రిజ్‌పాల్ అనే యువ‌కుడు కారుకు అడ్డంగా బైఠాయించాడు. ఈ ఆందోళ‌న ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బీడీఓ- ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న బ్రిజ్‌పాల్‌ను ఇలా కారుపైకి ఎక్కించుకుని సుమారు నాలుగు కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించారు.

ఓ చోట సిగ్న‌ల్ ప‌డ‌టం పంక‌జ్ కుమార్ త‌న కారును నిలిపివేశారు. దీనితో ఆ యువ‌కుడు బోనెట్ దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here