వీడియోకాన్ నుండి చంద కొచ్చర్ 64కోట్ల రూపాయలు లంచం తీసుకుందని ఆరోపణలు..!

ప్రస్తుతం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో రోజుకో కుంభకోణం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐపై ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో పేరుతెచ్చుకున్న ఐసీఐసీఐ బ్యాంకు సియివో చంద కొచ్చర్ లంచం తీసుకుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ కు అక్రమంగా రూ. 3,250 కోట్ల రుణం వెళ్లగా, అందుకు ప్రతిఫలంగా రూ. 64 కోట్ల లబ్ది సీఈఓ చంద కొచ్చర్ కు చేరాయని కథనాలు ప్రచురించారు. ఆ డబ్బులు చందా కొచ్చర్ తీసుకోకపోయినా.. భర్త దీపక్ కొచ్చర్ చేతికందాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సీబీఐ, ఈడీ తదితర దర్యాఫ్తు సంస్థలు దృష్టిని సారించాయి.

పదేళ్ల క్రితం చంద కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు బంధువులు, వీడియోకాన్ గ్రూప్ యజమాని వేణుగోపాల్ ధూత్ లు కలసి న్యూ పవర్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఆపై తన సొంత కంపెనీ అయిన వీడియోకాన్ నుంచి ధూత్, కొత్త సంస్థకు రూ. 64 కోట్ల రుణం ఇచ్చారు. సంస్థలోని తన మొత్తం వాటాలను, యాజమాన్య హక్కులను కేవలం రూ. 9 లక్షలకే దీపక్ కొచ్చర్ కు విక్రయించారు. కానీ ఎక్కడ డౌట్ వచ్చిందంటే.. బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల రుణం వీడియోకాన్ కు వెళ్లిన ఆరు నెలల వ్యవధిలోనే కంపెనీ చేతులు మారింది. అప్పుడు ఇచ్చిన అప్పులో వీడియోకాన్ ఇంకా బ్యాంకుకు రూ. 2,810 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిందని.. పరస్పర లాభాల కోసమే అప్పట్లో ఆ డీల్ జరిగిందని అంటున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చ‌ర్‌కు బ్యాంకు బోర్డు బాసటగా నిల్చింది. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. కొచ్చ‌ర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని పేర్కొంది. రుణాలను ఆమోదించే విషయంలో తమ బ్యాంకు అంతర్గత వ్యవస్థ పటిష్టంగా ఉందని బోర్డు పేర్కొంది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచ్చ‌ర్ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్ధ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here