కామారెడ్డి: సైకిల్ ప్రపంచయాత్ర చేస్తోన్న రష్యన్ యాత్రికుడిని దొంగగా భావించారు స్థానికులు. కర్రలతో దాడి చేశారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు ఆ యాత్రికుడు ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత యాత్రికుడి పేరు అలెక్సి ఒలెగ్వె. మాస్కోకు చెందిన వ్యక్తి.
ఒంటరిగా సైకిల్‌పై ప్రపంచయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటికే 30 దేశాల్లో తన యాత్రను పూర్తిచేశారు. తన యాత్రలో భాగంగా..మహారాష్ట్రలోని షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం రాత్రి భిక్కనూర్ మీదుగా వెళ్తుండగా వర్షం వచ్చింది. దీనితో ఆయన గ్రామ శివార్లలోని పొలాల్లో టెంట్ వేసుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారు.
దీన్ని చూసిన నర్సారెడ్డి అనే రైతు అలెక్సిని అడ్డుకున్నారు. తెలుగులో మాట్లాడారు. భాష సమస్య తలెత్తింది. తనకు తెలియదని, తాను ఫలానా అని చెబుతున్నప్పటికీ.. తప్పుగా అర్థం చేసుకున్న నర్సారెడ్డి ఆయనను దొంగగా భావించాడు. తన వద్ద టార్చిలైట్‌తో ముఖం, దవడపై కొట్టాడు. దీనితో దవడ పన్ను విరిగింది. ముఖానికి గాయాలయ్యాయి.
గాయపడిన అలెక్సిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. దొంగతనం చేయడానికి వచ్చాడంటూ ఫిర్యాదు చేశారు. అలెక్సి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన తరువాత పోలీసులు.. అసలు విషయాన్ని స్థానికులకు వివరించారు.
భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసిన అనంతరం అతణ్ణి, మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దవడకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు.