తల్లిదండ్రులనే చంపాలని అనుకున్నాడు.. చనిపోయినట్లు వాళ్ళే నాటకమాడారు.. అడ్డంగా దొరికిన కొడుకు..!

తల్లిదండ్రులనే చంపాలని సుపారీ ఇచ్చాడు ఓ సుపుత్రుడు.. వారిని చంపేస్తే ఆస్థి తనకే అని భావించిన ఆ వ్యక్తి ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులు చనిపోయినట్లు నాటకమాడారు. తన తల్లిదండ్రులు చనిపోయారని భావించిన ఆ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. క్రైమ్ థ్రిల్లర్ ను తలపించిన ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

22 సంవత్సరాల యువకుడు కుటుంబం మొత్తాన్ని చంపేయాలని అనుకున్నాడు. అందుకోసం కొంతమంది సీరియల్ కిల్లర్స్ ను కూడా నియమించాడు. ఈ విషయం రష్యన్ ఆఫీసర్లకూ.. అతడి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అతడి బుద్ధిని బయటపెట్టాలని అనుకున్నారు. అతడి తండ్రి, తల్లి.. 10 సంవత్సరాల సోదరి అంతా చనిపోయినట్లు నాటకమాడారు. అందుకు ఓ రష్యన్ పోలీసు కూడా ఆ కుటుంబ సభ్యులకు సహాయం చేశారు.

ఆ యువకుడు సుపారీ కిల్లర్ ను సంప్రదించాడు. ఆ సుపారీ కిల్లర్ ఎవరో కాదు.. ఓ పోలీసు అధికారి. అతడికి తన ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఆ యువకుడు చెప్పేశాడు. అంతేకాదు కుక్కలు ఎక్కడ ఉన్నాయి.. సెక్యూరిటీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి.. అన్న చాలా విషయాలను ఫోన్ లో ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశానని వారి ఫోటోలు తీసి ఆ యువకుడికి పంపించాడు. తల్లిదండ్రులు చనిపోయిన ఫోటోలు చూసి ఆ యువకుడు ఎంతగానో సంతోషించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ కు తన ఆస్థి తన చేతికి రాగానే 34 లక్షల రూపాయల మర్డర్ డీల్ డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈ విషయమంతా తల్లిదండ్రులు ఆడిన నాటకమని ఆ యువకుడు గుర్తించలేదు. కాంట్రాక్ట్ కిల్లర్ గా నటిస్తున్న పోలీసు అధికారి సమాచారం అందించడంతో రష్యన్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

తాను తన తల్లిదండ్రులను, చెల్లెలిని చంపాలని అనుకుంది నిజమేనని ఒప్పేసుకున్నాడు. గతంలో కూడా తాను రెండు సార్లు వాళ్ళను చంపాలని ప్లాన్ చేశానని చెప్పాడు. అతడు ఇంటర్నెట్ లో చంపడం ఎలా అని సర్చ్ కూడా చేసినట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఓ కాఫీ గిన్నెలో మాత్రలు కలిపి చంపేయాలని అనుకున్నాడు. అయితే అందులో ఏదో తేడా ఉందని గమనించిన అతడి తండ్రి దాన్ని తాగలేదట. తల్లిదండ్రులు తనకు డబ్బులు ఇవ్వడం లేదన్న ఒకే ఒక్క కారణంతోనే ఆ యువకుడు వారి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ కేసులో ఆ యువకుడికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here