రోడ్డు వేయాలని ప్రయత్నిస్తుండగా బయటపడ్డ సొరంగం.. మిస్టరీ..!

నేషనల్ హైవే వేయడం కోసం అధికారులు అప్పటికే చర్యలు చేపట్టారు. అనుకున్న దారిలో వారు త్రవ్వుకుంటూ వెళుతుండగా ఓ సొరంగం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని రాయసేన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సొరంగం బయటపడగానే పనులన్నీ ఆపి వేశారు అధికారులు. రాయసేన్ ప్రాంతంలో పురాతన కట్టడాలు.. కోటలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన రహస్య ద్వారం అయి ఉండొచ్చని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇది మానవనిర్మిత సొరంగం కాదని అంటున్నారు.

గోపాల్ పూర్ నుండి సదాల్తపూర్ వరకూ నేషనల్ హైవే నిర్మిస్తున్నారు. అందుకోసం బైపాస్ రోడ్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రోక్లేనర్ వాహనంతో ఈ నిర్మాణాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా భూమి కూరుకుపోయింది. అంతలో అక్కడ ఒక సొరంగం బయటపడింది. వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. రోడ్డు పనిని ఆపివేయమని వారు సూచించారు. పురాతత్వశాఖ అధికారులకు కూడా విషయంపై సమాచారం అందించారు.

ఈ సొరంగం 7 అడుగుల పొడవు.. రెండు అడుగుల వెడల్పు ఉన్నట్లు తెలుస్తోంది. రాయసేన్ ప్రాంతంలో ఇలాంటి సొరంగాలు గతంలో చాలా ఉండేవని స్థానికులు చెప్పారు. వాటితో ఈ సొరంగానికి ఏమైనా లింక్ ఉండొచ్చని అంటున్నారు. అయితే మరికొందరు ఇదేమీ మానవ నిర్మితమైన సొరంగం కాదని.. భూకంపం వచ్చినప్పుడు భూమి లోపల ఏర్పడ్డ పగుళ్ళ కారణంగా ఇది ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here