రైలులో ఘోరం! మ‌హిళ‌, ఆమె కుమారుడి ప‌ట్ల అరాచ‌కం!

ల‌క్నో: త‌న అయిదేళ్ల కుమారుడితో క‌లిసి రైలులో వెళ్తోన్న ఓ మ‌హిళ‌పై అత్యంత హేయంగా ప్ర‌వ‌ర్తించారు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. ఆమెను నిలువునా దోచుకున్నారు. మంగ‌ళ‌సూత్రంతో స‌హా ఒంటిపై ఉన్న బంగారు వ‌స్తువులు, కొంత న‌గ‌దును దోచుకున్నారు. అయిదేళ్ల పిల్లాడ‌ని కూడా చూడ‌కుండా తీవ్రంగా కొట్టారు.

ఇద్ద‌ర్నీ న‌డుస్తున్న రైలులో నుంచి బ‌య‌టికి తోసి వేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు వారిని కాపాడారు. బాధితురాలి పేరు మ‌మ‌త‌. త‌న కుమారుడితో క‌లిసి వార‌ణాశి నుంచి బ‌రేలికి వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోని చందౌలి స్టేష‌న్ స‌మీపంలో ఈ ఘ‌టన చోటు చేసుకుంది.

రైలులో చిట్ట‌చివ‌రి బోగీలో ఆమె కూర్చుని ఉండ‌గా.. చందౌలి స్టేష‌న్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అందులోకి ఎక్కారు. మమ‌త, ఆమె కుమారుడిని కొట్టారు. ఆమె వ‌ద్ద ఉన్న 1000 రూపాయ‌ల న‌గ‌దు, దుస్తులు, మంగ‌ళ‌సూత్రం, గాజులు, ముక్కుపుడ‌క‌ను దోచుకుని, వేగంగా వెళ్తోన్న రైలు నుంచి తోసివేశారు.

 

వ్యాస్‌న‌గ‌ర్ స్టేష‌న్ స‌మీపంలో ప‌ట్టాల మీదుగా న‌డుచుకుంటూ వెళ్తోన్న జ‌నార్ద‌న్ సింగ్ అనే కాంట్రాక్ట‌ర్ వారిని గమ‌నించి, రైల్వే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఇద్ద‌ర్నీ మొఘ‌ల్ స‌రాయ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వారిద్ద‌రూ చికిత్స పొందుతున్నారు. మ‌మ‌త ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని, ఆమె మాట్లాడ‌లేని స్థితిలో ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here