13 ఏళ్ల మేన‌కోడ‌లిపై బాయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించిన మ‌హిళ

న్యూఢిల్లీ: వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న వ్య‌క్తితో త‌న మేన‌కోడలిపై అత్యాచారం చేయించిందో కిరాత‌క మ‌హిళ‌. దేశ రాజ‌ధానిలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ల్లి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల త‌న వ‌ద్దే నివసిస్తోన్న 13 సంవ‌త్స‌రాల మేన‌కోడ‌లిపై ఆమె ఈ ఘాతుకానికి పాల్ప‌డింది.

మేన‌కోడ‌లికి మ‌ద్యం తాగించి మ‌రీ.. త‌న ప్రియుడితో అత్యాచారం చేయించిందామె. చిన్న‌ప్పుడే ఆ బాలిక త‌ల్లి మ‌ర‌ణించింది. తండ్రితో క‌లిసి షాబాద్ డెయిరీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో నివ‌సిస్తోంది. తన తండ్రికి వ‌రస‌కు చెల్లెలయిన ఓ మహిళ కూడా వాళ్ల ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమెకు ముకేశ్ కుమార్ అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంది. అత‌ను మినీ ట్రక్ డ్రైవర్.

ముకేశ్ క‌న్ను ఆ బాలిక‌పై ప‌డింది. దీంతో చిన్నారిని ప్రలోభపెట్టిన ఆ మహిళ ఆమెను తీసుకుని ద‌గ్గ‌ర్లో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారికి కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చింది. వ‌ద్ద‌ని చెప్పినా వినకుండా బలవంతంగా తాగించింది. అనంతరం ముకేష్ కుమార్ త‌న ప్రియురాలి ముందే ఆ బాలిక‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధిత బాలిక‌ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బాలికకు రక్తస్రావం అవడాన్ని గమనించిన తండ్రి వెంటనే ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. వెంట‌నే పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ముకేష్‌కుమార్‌, అత‌ని ప్రియురాలిపై కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ముకేష్ పారిపోయాడు. అత‌ను బీహార్‌లో ఉన్న‌ట్లు సెల్‌ఫోన్ లొకేష‌న్ ద్వారా తేలింది. పోలీసులు అక్క‌డికి ప్ర‌త్యేక బృందాన్ని పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here