ప‌ట్టాల ప‌క్క‌న దొరికిన మృత‌దేహం వెనుక‌..మిస్ట‌రీ!

హైద‌రాబాద్‌: స‌న‌త్‌న‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ప‌ట్టాల ప‌క్క‌న దొరికిన మృత‌దేహం వెనుక ఉన్న మిస్ట‌రీ వీడింది. అది ప్ర‌మాదం కాద‌ని, హ‌త్యేన‌ని పోలీసులు నిర్ధారించారు. ఈ హ‌త్యోదంతంలో హ‌తుడి భార్య కీల‌క సూత్ర‌ధారిగా పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. స‌న‌త్‌న‌గ‌ర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

భ‌ర్త‌ను హ‌త్య చేయించ‌డానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను సుపారీగా ఇచ్చిన‌ట్టు నిందితురాలు త‌మ ద‌ర్యాప్తులో అగీక‌రించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మొద‌ట‌- రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు భావించారు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక మాత్రం.. పోలీసుల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది.

రైలు ఢీ కొన‌డం వ‌ల్ల అత‌ను మ‌ర‌ణించ‌లేద‌ని, బ‌ల‌మైన వ‌స్తువుతో త‌ల‌పై మోద‌డం వ‌ల్లే చ‌నిపోయిన‌ట్టు తేలింది. హ‌తుడి పేరు ఖాజ. బోర‌బండ‌కు చెందిన ఖాజా వృత్తిరీత్యా డ్రైవ‌ర్‌. రెండు నెల‌ల కింద‌ట అత‌ని మృత‌దేహం బోరబండ ఎంఎంటీఎస్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ల‌భించింది. మృతదేహం పైనుంచి పలు రైళ్లు వెళ్లడంతో ఛిద్ర‌మైంది.

దీన్ని మొద‌ట నాంపల్లి రైల్వే పోలీసులు ప్రమాదంగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. మృత‌దేహం ల‌భించిన ప్ర‌దేశంలో గాలించ‌గా..ఓ లావుపాటి బండ‌రాయి క‌నిపించింది. దానిపై ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటి ఉండ‌టంతో రైల్వే పోలీసులు.. ఈ కేసును స‌న‌త్‌న‌గ‌ర్ స్టేష‌న్‌కు బ‌ద‌లాయించారు.

హ‌త్య జ‌రిగిన మ‌రుస‌టి రోజు ఖాజా భార్య స‌లేహా బేగం.. త‌న భ‌ర్త క‌నిపించ‌ట్లేదంటూ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.  ఎస్సార్‌నగర్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదైన విష‌యాన్ని ఎస్సార్‌న‌గ‌ర్ పోలీసుల ద్వారా తెలుసుకున్న స‌న‌త్‌న‌గ‌ర్ పోలీసులు త‌మ‌కు ల‌భించిన మృత‌దేహం ఖాజాదేనని నిర్ధారించుకున్నారు.

ఖాజాది హ‌త్యేన‌ని తేల‌డంతో మొద‌ట‌గా వారి అనుమానం స‌లేహాబేగంపైనే మ‌ళ్లింది. దీనితో వారు ఆమె ఇంటి ప‌రిస‌రాల్లో ఆరా తీశారు. బోర‌బండ‌కు చెందిన ఓ మాంస‌ వ్యాపారి ఖురేషీతో స‌లేహా బేగంకు వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు తేలింది. ఈ విష‌యం తెలిసిన త‌రువాత ఖాజ తన భార్యను, ఖురేషీని పలుమార్లు మందలించాడు.

దీనితో భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డానికి ఆమె కుట్ర ప‌న్నింది. బోర‌బండ‌కు చెందిన సయ్యద్‌ ముజీబ్ అనే ఆటోడ్రైవ‌ర్‌కు వారిద్ద‌రూ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల సుపారి ఇచ్చారు. దీనితో అత‌ను త‌న స్నేహితులతో క‌లిసి ఖాజాను బోర‌బండ రైల్వేస్టేష‌న్ స‌మీపంలోకి తీసుకెళ్లారు. అక్క‌డ మ‌ద్యం సేవించారు. అనంత‌రం బండరాళ్లతో మోది హత్య చేశారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ప్రమాద ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న‌వారంద‌ర్నీ పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here