చీరెతో బోరుకు క‌ట్టేసి..!

ఈ ఫొటోలో ఉన్న మ‌హిళ పేరు కలకొండ మరియమ్మ. తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో నివ‌సిస్తున్నారు. స్వ‌యం స‌హాయక బృందంలో స‌భ్యురాలు. ఆమె స‌భ్యురాలుగా ఉన్న స్వ‌యం స‌హాయక బృందం చాలా రోజుల కింద‌ట బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. మరియమ్మ 21వేల రూపాయ‌ల అప్పును తీసుకున్నారు.

ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో స‌కాలంలో వాటిని ఆమె తిరిగి చెల్లించలేదు. మ‌రియ‌మ్మ పేరు మీద `స్త్రీనిధి` నుంచి 20 వేల రూపాయ‌ల రుణం మంజూరైంది. రుణం తీసుకున్న త‌రువాత మరియ‌మ్మ గ్రామం విడిచి వెళ్లారు. అయిదు నెల‌లుగా ఒంట‌రిగా ఖ‌మ్మంలో నివ‌సిస్తున్నారు. విభేదాల కార‌ణంగా ఆమె భ‌ర్త‌, పిల్ల‌ల‌ను వ‌దిలి ఖ‌మ్మంలో నివ‌సిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

మ‌రియ‌మ్మ భ‌ర్త‌, పిల్ల‌లు నేల‌ప‌ట్ల‌లోనే ఉంటున్నారు. భర్త వద్ద ఉన్న పిల్లల్ని చూడ‌టానికి మ‌రియ‌మ్మ‌ శ‌నివారం ఆ గ్రామానికి వెళ్లారు. ఆమె వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న స్వ‌యం స‌హాయ‌క బృందం స‌భ్యులు రుణ చెల్లింపుల కోసం నిల‌దీశారు. తన వద్ద అంత డ‌బ్బు లేద‌ని, ప్ర‌స్తుతం తాను ఆ మొత్తాన్ని ఇచ్చే ప‌రిస్థితుల్లో కూడా లేన‌ని వివ‌రించారు.

దీనితో ఆగ్ర‌హించిన బృందం ఇత‌ర స‌భ్యులు ఆమెను అవ‌మానించారు. చీరతో బోరుకు కట్టేశారు. సుమారు రెండు గంటలపాటు అలాగే నిర్బంధించారు. ఈ విష‌యం తెలుసుకున్న కూసుమంచి పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, ఆమెను విడిపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురు మ‌హిళ‌ల‌పై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here