రాత్రి ఐబీఎం ఇచ్చిన పార్టీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగిని..తెల్లారేస‌రికి!

హైద‌రాబాద్‌: సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఐబీఎం యాజ‌మాన్యం త‌న సంస్థ‌లో ప‌నిచేస్తోన్న ఉద్యోగుల కోసం శ‌నివారం రాత్రి ఓ ప‌బ్‌లో డిన్న‌ర్ ఏర్పాటు చేసింది. అందులో ఉత్సాహంగా పాల్గొని.. జోక్స్ క‌ట్ చేసిన ఓ ఉద్యోగిని తెల్లారేసరికి మృత‌దేహ‌మై క‌నిపించారు. తాను నివ‌సిస్తున్న ప్లాట్‌లో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

హైద‌రాబాద్ చందాన‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు రేఖ‌. 30 సంవ‌త్స‌రాలు. ఆరేళ్ల కింద‌ట హైద‌రాబాద్ లంగ‌ర్‌హౌస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉజ్వ‌ల్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఉజ్వ‌ల్ కూడా ఐబీఎంలోనే ప‌నిచేస్తున్నారు. కొంత‌కాలంగా వారు చందాన‌గ‌ర్‌లోని అప‌ర్ణ గార్డెనియా అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్నారు.

ఉజ్వ‌ల్ ఆమెను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడ‌నే మాటే గానీ.. రోజూ అనుమానించే వాడ‌ని, వేరొక‌రితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో హింసించే వాడ‌ని రేఖ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త‌మ కుమార్తె ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా అల్లుడు అనుమానించే వాడని అంటున్నారు.

శనివారం ఉద్యోగులందరికీ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఐబీఎం సంస్థ డిన్న‌ర్ పార్టీ ఇచ్చింది. ఉజ్వల్‌ భార్యను రాత్రి 7.30 గంటల సమయంలో పబ్‌ వద్ద దించి తాను తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో భార్యను పికప్‌ చేసుకోవటానికి వెళ్లాడు.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. చందాన‌గ‌ర్ ఫ్లాట్‌కు వెళ్లిన త‌రువాత తాము ఇద్ద‌రం వేర్వేరు గ‌దుల్లో నిద్ర‌పోయామ‌ని, తెల్లారి లేచి చూసే స‌రికి రేఖ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించిందని ఉజ్వ‌ల్ చెబుతున్నారు.

స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఉజ్వ‌ల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here