అద్దె ఎగ్గొట్టి, ఇల్లు ఖాళీ చేసి వెళ్లింద‌ని అనుకున్నారు! మూడేళ్ల త‌రువాత అదే అద్దె ఇంట్లో ఆమె మృత‌దేహం!

న్యూయార్క్‌: అచ్చం హాలీవుడ్ సినిమాల్లోలా క్రైమ్ థ్రిల్ల‌ర్ల‌ను మ‌రిపించే ఘ‌ట‌న ఇది. అమెరికాలోని హ్యూస్ట‌న్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నలో ఓ మాంఛి క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాకు స‌రిప‌డే మెటీరియ‌ల్ ఉంది.

మేరీ స్టివ‌ర్ట్ సెర్రూటి అనే 61 సంవ‌త్స‌రాల మ‌హిళ హ్యూస్ట‌న్‌లో ఒంట‌రిగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తుండేది. 2015 జూన్‌లో ఆమె ఉన్న‌ట్టుండి క‌నిపించ‌కుండా పోయింది. అద్దె ఎగ్గొట్టి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింద‌నుకున్నాఆ ఆ ఇంటి య‌జ‌మాని.

ఆమె ఆచూకీ క‌నుక్కోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సాధ్య ప‌డ‌లేదు. ఆమె క‌నిపించ‌ట్లేదంటూ బంధువుల‌కు తెలియ‌జేశాడు. వారు కూడా వెదికారు గానీ మేరీ స్టివ‌ర్ట్ ఆచూకీ తెలియ‌రాలేదు. దీనితో బంధువులు హ్యూస్ట‌న్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద న‌మోదు చేసుకున్నారు పోలీసులు. ఆమె కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

క‌ట్ చేస్తే..ఇల్లు ఎలాగూ ఖాళీ అయింది క‌దా? అని టులెట్ బోర్డు పెట్టాడు ఆ ఇంటి య‌జ‌మాని. కొత్త‌గా పెళ్ల‌యిన జంట ఆ అద్దె ఇంట్లో దిగింది. దిగిన‌ప్ప‌టి నుంచీ ఏదో వాస‌న వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుండ‌టంతో ఆరు నెల‌ల పాటు కూడా ఆ ఇంట్లో ఉండ‌లేక‌పోయారు. ఖాళీ చేసి వెళ్లిపోయారు.

మ‌రోసారి టులెట్ బోర్డు పెట్టాడా ఇంటి య‌జ‌మాని. గ‌త ఏడాది మేలో ఓ పిల్ల‌లున్న కుటుంబం ఆ ఇంట్లో దిగింది. వారికి కూడా ఆ వాస‌న సోకిన‌ప్ప‌టికీ.. వేరే మార్గం లేక అదే అద్దె ఇంట్లో కొన‌సాగారు.

 

ఈ తొమ్మిది నెల‌ల పాటు వారు ఆ వాస‌న‌ను భ‌రిస్తూ వ‌చ్చారు.. ఓ ర‌కంగా చెప్పాలంటే అల‌వాటు ప‌డ్డారు. క్ర‌మంగా ఆ వాస‌న త‌గ్గిపోయింది. ఎప్పుడో ఓ సారి గాలివాటుగా వ‌స్తుండేది.

బుధ‌వారం సాయంత్రం ఆ ఇంటి బాత్‌రూమ్ వెనుక ఉండే గోడ వ‌ద్ద‌కు వెళ్లాడు అద్దెకున్న కుటుంబ పెద్ద‌. అక్క‌డ ఒక‌ట్రెండు మాన‌వ అస్తిపంజ‌ర ఎముక‌లు క‌నిపించాయి. దీనితో ఉలిక్కి ప‌డ్డ అత‌ను గోడ‌ను మొత్తం ప‌గుల గొట్టి చూడ‌గా షాక్ కొట్టిన వాడిలా బిగుసుకుపోయాడు. కార‌ణం.. ఓ మృత‌దేహం. వెంట‌నే- అత‌ను పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే హ్యూస్ట‌న్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇంటి య‌జ‌మానిని పిలిపించారు. మృత‌దేహం అస్తిక‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్క‌డే క‌ళ్ల‌ద్దాలు క‌నిపించాయి. దీనితో ఆ ఇంటి య‌జ‌మానికి అనుమానం వ‌చ్చింది. ఇలాంటి అద్దాల‌నే అదృశ్య‌మైన మ‌హిళ కూడా వాడేద‌ని చెప్పాడు.

దీనితో పోలీసుల అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. అస్తిక‌ల‌ను డీఎన్ఎ టెస్ట్ కోసం పంపించారు. అలాగే- మేరీ స్టివ‌ర్ట్ ద‌గ్గ‌రి బంధువుల డీఎన్ఏను సేక‌రించారు. ఈ రెండింటినీ ప‌రీక్షించ‌గా స‌రిపోయాయి. దీనితో ఆ కంకాళాలు మేరీ స్టివ‌ర్ట్‌వేన‌ని నిర్ధారించారు.

సాధార‌ణంగా విదేశాల్లో ఉండే ఇండిపెండెంట్ గృహాల్లో గోడ‌కు ఇంటికి మ‌ధ్యా కొంత ఖాళీ స్థ‌లాన్ని ఉంచుతారు. ఆ స్థ‌లాన్ని స్టోర్‌రూమ్‌గా వినియోగిస్తారు. వాటికి త‌లుపును ఏర్పాటు చేసి, తాళం వేస్తుంటారు.

ఇలాంటి ఇళ్ల‌ను కూడా మ‌నం హాలీవుడ్ హార్ర‌ర్ సినిమాల్లో చూసే ఉంటాం. ఆ ఖాళీ స్థ‌లంలోకి వెళ్లి కూర్చునే అల‌వాటు ఉంద‌ట మేరీ స్టివ‌ర్ట్‌కు. రోజూ కొద్దిసేపు అక్క‌డికెళ్లి విశ్రాంతి తీసుకునేద‌ట‌. ఓ సారి ఆ ఖాళీ స్థ‌లానికి వెళ్లి అక్క‌డే చిక్కుకుపోయింది. ఊపిరాడ‌క మ‌ర‌ణించి ఉంటుంద‌ని నిర్ధారించారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here