పాము కాటేసిందని ఒంటిపై ఆవుపేడను క‌ప్పారు! గంట‌న్న‌ర త‌రువాత చూస్తే..!

ల‌క్నో: పాము కాటు వేస్తే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? ఆసుప‌త్రికి ప‌రుగెత్తుతారు. స‌రైన వైద్యం చేయిస్తారు. గ్రామాల్లోనైతే.. కాటు ప‌డిన చోట ప‌స‌రు పూస్తారు. ఈ ఉదంతంలో మాత్రం గ్రామ‌స్తులు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించారు. మంత్ర‌గాడు చెప్పాడ‌ని ఒంటిని ఆవుపేడ‌తో క‌ప్పారు. ఒంటినిండా ఆవుపేడ క‌ప్పడంతో ఊపిరి ఆడ‌క పాముకాటుకు గురైన మ‌హిళ మ‌ర‌ణించారు.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌ష‌హ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు దేవేంద్రి. వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఆమెకు అయిదుమంది పిల్ల‌లు. వంట వ‌డ‌టానికి అవ‌స‌ర‌మైన క‌ట్టెల‌ను సేక‌రించ‌డానికి వెళ్ల‌గా.. ఆమెకు పాము కాటు వేసింది. ప‌రుగెత్తుకుంటూ ఇంటికి వ‌చ్చిన ఆమె భ‌ర్త‌కు ఈ విష‌యాన్ని చెప్పారు.

ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌కుండా మంత్ర‌గాడి వ‌ద్ద‌కు వెళ్లాడా భ‌ర్త‌. దేవేంద్రి ఇంటికి వ‌చ్చిన మంత్ర‌గాడు.. శరీరం నిండా ఆవుపేడ‌ను పూస్తే ఫ‌లితం ఉంటుంద‌ని, అది విషాన్ని లాగేస్తుంద‌ని సూచించాడు.

వెనుకా ముందూ ఆలోచించ‌లేదా భ‌ర్త‌. వెంట‌నే ఆమెను వీధిలో ప‌డుకోబెట్టి.. శ‌రీరంపై ఆవుపేడ‌ను క‌ప్పారు.శ‌రీరంపై క‌ప్పిన ఆవుపేడ‌తో ఆమె సుమారు ఒక‌టిన్న‌ర గంట‌పాటు వీధిలోనే ప‌డుకుంది. దీనితో- ఊపిరి ఆడ‌క మ‌ర‌ణించింది. మంత్ర‌గాడి వ‌ల్లే త‌న భార్య‌ను కోల్పోయానంటూ దేవేంద్రి భ‌ర్త పెడ‌బొబ్బ‌లు పెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here