ప్రేమించాలంటూ వెంట‌ప‌డ్డాడు..శాడిజాన్ని భ‌రించ‌లేక ఉరి వేసుకుంది!

శివ‌మొగ్గ‌: త‌న‌ను ప్రేమించాలంటూ ఓ యువ‌కుడి వేధింపుల‌ను భ‌రించ‌లేక బీపీఓ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు చేత‌న. 19 సంవ‌త్స‌రాల చేత‌న ఎంసీఏ చ‌దువుతోంది. జిల్లాలోని మ‌ల‌వ‌గుప్పె గ్రామానికి చెందిన మంజా నాయ‌క్ కుమార్తె ఆమె.

వ్యాపార రీత్యా మంజా నాయ‌క్ త‌న కుటుంబంతో క‌లిసి శివ‌మొగ్గ‌లోని వెంక‌టేశన‌గ‌ర‌లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీ‌నివాస్ అనే యువ‌కుడు చాలాకాలం నుంచి చేత‌నను ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. శ్రీ‌నివాస్‌కు మొబైల్‌షాప్ ఉంది.

అత‌నిపై చేత‌న తండ్రి మంజానాయ‌క్ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. శ్రీ‌నివాస్ త‌న వైఖ‌రిని మార్చుకోలేదు. ఆరునెల‌లుగా అత‌ని వేధింపులు మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యాయి. చేత‌న బీపీఓ ఉద్యోగిని కావ‌డంతో ఆఫీసు వేళ‌ల్లో ఎప్పుడంటే అప్పుడు ఆమె వ్య‌క్తిగ‌త సెల్ నంబ‌ర్‌కు ఫోన్ చేస్తుండేవాడు.

 

దీనితో ఆమె తీవ్రంగా మ‌నస్తాపానికి గుర‌య్యారు. శ‌నివారం సెల‌వురోజు కావ‌డ‌తో ఆమె ఇంట్లోనే ఉన్నారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో ఇంట్లో వారు బ‌య‌టికి వెళ్లిపోగా..ఆ స‌మ‌యంలో ఒంట‌రిగా ఉన్న చేత‌న‌కు మ‌ళ్లీ, మ‌ళ్లీ ఫోన్ చేశాడు శ్రీ‌నివాస్‌.

ఇక‌- అత‌ని శాడిజాన్ని భ‌రించ‌లేక ఆమె ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆమె మృత‌దేహాన్ని, ఆమె రాసిన‌ట్టుగా చెబుతోన్న ఆత్మ‌హ‌త్య లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ‌నివాస్‌పై శివ‌మొగ్గ జ‌య‌న‌గ‌ర పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here