సూట్‌కేస్‌లో యువ‌కుడి మృత‌దేహం! త‌వ్విన‌కొద్దీ షాకింగ్ ట్విస్టులే!

జైపూర్‌: దండుపాళ్యం టైప్ గ్యాంగ్ తెలుసు క‌దా! న‌ర‌రూప రాక్ష‌సులు. డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఇంకెవ‌రూ దొర‌క‌లేద‌న్న‌ట్టు అలాంటి ముఠాలో అమ్మాయిని ప్రేమించాడో యువ‌కుడు. దానికి త‌గిన మూల్యం చెల్లించుకున్నాడు. త‌న ప్రాణాల‌నే పోగొట్టుకున్నాడు.

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ శివార్ల‌లోని అమేర్ ప్రాంతంలో సూట్‌కేస్‌లో ల‌భించిన యువ‌కుడి మృత‌దేహం ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చిన ట్విస్టులు పోలీసుల‌ను సైతం ఉలిక్కిప‌డేలా చేశాయి. మంచినీళ్లు తాగినంత సులువుగా కిడ్నాప్‌లు, హ‌త్య‌లు చేసే గ్యాంగ్ అమ్మాయితో ప్రేమ‌లోప‌డిన ఆ యువ‌కుడు.. చివ‌రికి ఆ అమ్మాయి చేతిలోనే దారుణ‌హ‌త్య‌కు గురైన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

డ‌బ్బున్న అబ్బాయిల‌ను వ‌ల‌లో వేసుకుని, వారితో శారీర‌క సంబంధాన్ని పెట్టుకోవ‌డానికి కూడా వెనుకాడ‌ని గ్యాంగ్ అది. హ‌తుడి పేరు దుష్యంత్ శ‌ర్మ‌. జోఠ్వాడా గ్రామానికి చెందిన దుష్యంత్ శ‌ర్మ‌కు కొద్దిరోజుల కింద‌ట ఓ అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆమె కిడ్నాప్ గ్యాంగ్ స‌భ్యురాల‌నే విష‌యం అత‌నికి తెలియ‌దు.

ఆదివారం త‌న ప్రియురాలిని క‌లుసుకోవ‌డానికి వెళ్లిన దుష్యంత్ శ‌ర్మ ఇక తిరిగి రాలేదు. అదృశ్యం అయ్యాడు. అదే రోజు సాయంత్రం జోఠ్వాడాలో ఉండే అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ వ‌చ్చింది. దుష్యంత్ శ‌ర్మ‌ను కిడ్నాప్ చేశామ‌ని, తాము అడిగినంత డ‌బ్బులివ్వ‌క‌పోతే.. చంపేస్తామ‌నీ బెదిరించారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌జేశారు కుటుంబ స‌భ్యులు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టిన కొన్ని గంట‌ల్లోనే.. ఓ సూట్‌కేస్ దొరికింది. జైపూర్ శివార్ల‌లోని అమేర్ ప్రాంతంలో నిర్మానుష్య ప్ర‌దేశంలో ల‌భించిన బారీ సూట్‌కేస్‌లో యువ‌కుతి మృత‌దేహం ఉన్న‌ట్టు స‌మాచారం అందింది. వెళ్లి.. చూడ‌గా అది దుష్యంత్ శ‌ర్మ‌దే కావ‌డం పోలీసులు దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్ప‌టికే- ఆ గ్యాంగ్ న‌గ‌రం వ‌దిలి పారిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here