9న పెళ్లి: పెళ్లి ప‌త్రిక‌ల‌ను పంచ‌డానికి వెళ్లిన వ‌రుడిని అతి దారుణంగా..!

రంగారెడ్డి: ఈ నెల 9వ తేదీన పెళ్లి పీట‌లు ఎక్కాల్సిన ఓ యువ‌కుడు అతి దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌ణ్ణి బండ‌రాయితో మోది చంపారు. అనంత‌రం మృత‌దేహాన్ని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండటానిక‌నే ఉద్దేశంతో పెట్రోలు పోసి త‌గుల‌బెట్టారు.

పెళ్లి ప‌త్రిక‌లు ఇవ్వ‌డానికి వెళ్లిన త‌మ కుమారుడు ఎంత‌కూ తిరిగి రాక‌పోవ‌డంతో.. అత‌ణ్ని వెదుక్కుంటూ వెళ్లిన కుటుంబ స‌భ్యుల‌కు రోడ్డు ప‌క్క‌న ముళ్ల‌పొద‌ల్లో స‌గం కాలిన మృత‌దేహంగా క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌కు పెళ్లి కుదిరింది. ఈ నెల 9న వివాహం.

బంధువులు, స్నేహితుల‌కు పెళ్లి ప‌త్రిక‌ల‌ను ఇవ్వ‌డానికి ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి-పటేల్ గూడ గ్రామానికి ఆదివారం బ‌య‌లుదేరి వెళ్లాడు. ఇక వెన‌క్కి రాలేదు. ఫోన్ చేయ‌గా స్విచాఫ్ వ‌చ్చింది. దీనితో రాత్రంతా ఎదురు చూసిన కుటుంబ స‌భ్యులు అత‌ని కోసం వెదుక్కుంటూ వెళ్ల‌గా..పొలం దగ్గర ఒళ్ళంతా కాలిన స్థితిలో చనిపోయి కనిపించాడు.

మృత‌దేహాన్ని చూసిన త‌ల్లిదండ్రులు, కుటుంబీకులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి పీట‌లు ఎక్కాల్సిన ర‌మేష్ ఇలా హ‌త్య‌కు గురి కావ‌డంతో ఆరుట్ల‌లో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here