ప్రేమించ‌ట్లేద‌ని..పొత్తి క‌డుపులో క‌త్తి దింపాడు!

మ‌రో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. త‌న ప్రేమ‌ను నిరాక‌రించింద‌నే ఆగ్ర‌హంతో ఓ యువ‌తిని క‌త్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ మూసాపేట్‌లో చోటు చేసుకుంది.

మృతురాలి పేరు జాన‌కి. 22 సంవ‌త్స‌రాల జాన‌కి సేల్స్ ప్ర‌మోట‌ర్‌. డీమార్ట్ సూప‌ర్‌మార్కెట్‌లో ఆమె ప‌నిచేస్తోంది. శ్రీ‌కాకుళం జిల్లా రాజాం మండ‌లానికి చెందిన జాన‌కి రూప అనే త‌న స్నేహితురాలితో క‌లిసి మూసాపేట్ హ‌బీబ్‌న‌గ‌ర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్‌బోర్డులోని డీమార్ట్ సూప‌ర్‌మార్కెట్‌లో ప‌నిచేస్తోంది. అదే సూప‌ర్‌మార్కెట్‌లో ఆనంద్ అనే యువ‌కుడు కొంత‌కాలంగా ప‌నిచేస్తున్నాడు.

రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండ‌లానికి చెందిన ఆనంద్ క‌న్ను జాన‌కిపై ప‌డింది. త‌న‌ను ప్రేమించాలంటూ అత‌ను రోజూ వేధిస్తుండేవాడు. అత‌ని ప‌ట్ల జాన‌కికి స‌ద‌భిప్రాయం లేదు.

దీనితో ఆమె అత‌ని ప్రేమ‌ను తిర‌స్క‌రించింది. హ‌బీబ్‌న‌గ‌ర్‌లో జానకి నివాసం ఉండే ఇంటి అడ్ర‌స్ తెలుసుకుని కొద్దిరోజుల కింద‌ట వెళ్లాడు. పెళ్లి చేసుకోక‌పోతే చంపేస్తాన‌ని బెదిరించాడు.

అన్నంత‌ప‌నీ చేశాడు. మంగ‌ళ‌వారం రాత్రి జాన‌కి ఒంట‌రిగా ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన ఆనంద్‌పై ఆమెపై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కూర‌గాయ‌లు త‌రిగే క‌త్తితో ఆమె పొత్తిక‌డుపులో పొడిచి పారిపోయాడు.

 

తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆమె సంఘ‌ట‌నాస్థ‌లంలోనే స్పృహ త‌ప్పింది. కొద్దిసేప‌టి త‌రువాత రూప ఇంటికొచ్చి చూడ‌గా.. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న జాన‌కిని చూసి షాక్‌కు గురైంది.

ఇరుగుపొరుగుకు వారికి తెలియ‌జేసింది. వారి స‌హాయంతో కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. కొస ప్రాణాల‌తో ఉన్న జాన‌కిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా..అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మ‌ర‌ణించింది.

పోలీసులు జాన‌కి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్నారు. ఆనంద్ కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here