`హోదా` హామీ ఇచ్చి విస్మ‌రించారు..మీరైనా గుర్తు చేయండి: రాష్ట్రప‌తితో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్‌స‌భ స‌భ్యులు మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు. వినతిప‌త్రాన్ని అంద‌జేశారు. లోక్‌స‌భ స‌భ్యులు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వారితో ఉన్నారు.

ప్ర‌త్యేక హోదా డిమాండ్‌పై తాము సాగిస్తోన్న పోరాటాన్ని రాష్ట్రప‌తి దృష్టికి తీసుకెళ్లారు. రాజ్య‌స‌భ స‌భ్యుడి ప్ర‌స్తుత ఉప రాష్ట్రప‌తి ఎం వెంక‌య్య నాయుడి డిమాండ్ మేర‌కు అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌నే విష‌యాన్ని గుర్తు చేశారు.

పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాల‌ని వారు కోరారు. ప్ర‌త్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము రాష్ట్రంలో పోరాటం సాగిస్తున్నామని, ఇందులో భాగంగా- త‌మ ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశామ‌ని ప్ర‌స్తావించారు. సుమారు 40 నిమిషాల పాటు వారు రామ్‌నాథ్ కోవింద్‌తో స‌మావేశం అయ్యారు.

అనంత‌రం బ‌య‌టికి వ‌చ్చిన వారు విలేక‌రుల‌తో మాట్లాడారు. హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని, దీనికోసం తాము ఎంత వ‌ర‌కైనా పోరాటం చేస్తామ‌ని మేక‌పాటి చెప్పారు. త‌మ నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల్లే హోదా డిమాండ్ స‌జీవంగా ఉంద‌ని అన్నారు.

ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఢిల్లీని మించిన‌ అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని తిరుపతి బహిరంగ సభలో న‌రేంద్ర‌మోడీ మాట ఇచ్చార‌ని, ఈ విష‌యాన్ని కూడా రాష్ట్రప‌తి వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పారు. రాజ్యాంగపరంగా తాను చేయ‌వ‌ల‌సిన‌ది చేస్తాన‌ని రాష్ట్రపతి కోవింద్‌ హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు. చంద్రబాబు నాయుడు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని మేకపాటి విమర్శించారు. ఆయన వైఖరితో రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోయిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here